భారత్‌లోకి చొరబడేందుకు 300మంది ఉగ్రవాదులు రెడీ!
ABN , First Publish Date - 2020-04-26T21:42:30+05:30 IST
కరోనా కట్టడిలో భారత్ బిజీగా ఉంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా

శ్రీనగర్: కరోనా కట్టడిలో భారత్ బిజీగా ఉంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తూ దాదాపు 300 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నియంత్రణ రేఖకు ఆవల వేచి చూస్తున్నారు. విషయాన్ని ముందే పసిగట్టిన భారత భద్రతా దళాలు చొరబాట్లను అడ్డుకునేందుకు ఇప్పటికే అస్త్రశస్త్రాలు రెడీ చేసి అప్రమత్తంగా ఉన్నాయి.
కశ్మీర్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదుల్లో కరోనా వైరస్ బాధితులు ఉండే అవకాశం ఉందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు సైనికులను కోరారు. నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారత్‌లో చొరబడేందుకు పీవోకేలో ఎదురుచూస్తున్న ఉగ్రవాదుల్లో చాలామంది నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎల్‌వోసీ వెంబడి పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపేందుకు 16 లాంచ్‌ప్యాడ్లను యాక్టివేట్ చేసినట్టు ఇటీవల భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఒక్క ఉగ్రవాది కూడా భారత్‌లోకి చొరబడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం క్రమం తప్పకుండా మీటింగులు నిర్వహించి చొరబాట్లను అడ్డుకునేందుకు కౌంటర్ ఇన్ఫిల్‌ట్రేషన్ గ్రిడ్ (సీఐజీ)ని తిరిగి ఒక్కటి చేస్తున్నట్టు లెఫ్టినెంట్ జనరల్ రాజు తెలిపారు.