పది గంటలుగా ఏకధాటిగా భారత్-చైనా కమాండర్ స్థాయి చర్చలు

ABN , First Publish Date - 2020-06-23T04:52:15+05:30 IST

న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కోర్ కమాండర్ స్థాయి చర్చలు పది గంటలుగా ఏకధాటిగా జరుగుతున్నాయి. చైనా కోరిక మేరకు జరుగుతున్న ఈ చర్చలు వాస్తవాధీన రేఖ వెంబడి చైనా

పది గంటలుగా ఏకధాటిగా భారత్-చైనా కమాండర్ స్థాయి చర్చలు

న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కోర్ కమాండర్ స్థాయి చర్చలు పది గంటలుగా ఏకధాటిగా జరుగుతున్నాయి. చైనా కోరిక మేరకు జరుగుతున్న ఈ చర్చలు వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వైపున్న మోల్దో ప్రాంతంలో కొనసాగుతున్నాయి. భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా తరపున మేజర్ జనరల్ లియు లిన్ చర్చలు జరుపుతున్నారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో తెలెత్తిన ఉద్రిక్తతలు తగ్గించే ఉద్దేశంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. మే నాలుగుకు ముందు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు చైనా అంగీకరించాలని భారత్ పట్టుబడుతోంది. చైనా బలగాలు వెనక్కు వెళ్లిపోవాలని సూచించింది. ఏ సమయం కల్లా వెళ్లిపోతారో కూడా చెప్పాలని భారత్ కోరింది. అంతేకాదు గల్వాన్ లోయ లాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భారత్ స్పష్టం చేసింది. 


జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా దాడి చేసి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఘటనపై భారత్ సీరియస్‌గా స్పందించడంతో డ్రాగన్ కంట్రీ దారిలోకి వచ్చింది. అసలే కరోనాను పుట్టించిన అపఖ్యాతి మూటకట్టుకోవడంతో పాటు విస్తరణ కాంక్షతో భారత భూభాగాన్ని కాజేసే క్రమంలో భారత జవాన్లను పొట్టనపెట్టుకుందంటూ ప్రపంచ దేశాలు చైనాపై దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనికి తోడు 15నాటి ఘటనలో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించినా డ్రాగన్ కంట్రీ క్లారిటీ ఇవ్వడం లేదు. దీనిపై స్థానికంగా కూడా చైనీయుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో మరణించిన సైనికులకు ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించిన వీడియోలు చైనా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో తమ సైనికులు చనిపోయారనే విషయాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించకపోవడంపై చైనీయులు గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో పరువు నిలుపుకోవడం కోసం చైనా కమాండర్ స్థాయి చర్చలు జరుపుతోంది. మరికొద్ది గంటల్లో రష్యా-భారత్-చైనా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కూడా ఉండటంతో చర్చలపై చైనా సీరియస్‌గా దృష్టి సారించింది. 

Updated Date - 2020-06-23T04:52:15+05:30 IST