మళ్లీ చైనా దూకుడు

ABN , First Publish Date - 2020-06-25T07:07:06+05:30 IST

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె లద్దాఖ్‌లోని చైనా సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మన సైన్యం యుద్ధ సన్నద్ధతను తెలుసుకునేందుకు...

మళ్లీ చైనా దూకుడు

  • గల్వాన్‌లోయలో కొత్త నిర్మాణాలు
  • భారీగా సైనికుల తరలింపు
  • ఉపగ్రహ చిత్రాలతో బట్టబయలు
  • యుద్ధ సన్నద్ధతపై ఆర్మీ చీఫ్‌ సమీక్ష
  • లద్దాఖ్‌లో సరిహద్దు ప్రాంతాల్లో పర్యటన 
  • చైనాకు దీటుగా బదులివ్వాల్సిందే
  • ఆర్మీ చీఫ్‌ నరవణెతో లద్దాఖ్‌ ఎంపీ  

న్యూఢిల్లీ, జూన్‌ 24: ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె లద్దాఖ్‌లోని చైనా సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మన సైన్యం యుద్ధ సన్నద్ధతను తెలుసుకునేందుకు, సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఆయ న లద్దాఖ్‌లోని కీలక ప్రాంతాల్లో పర్యటిస్తున్నా రు. 2 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సరిహద్దు సమీప ప్రాంతాలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. స్థానిక సైనికాధికారులతో మాట్లాడారు. గల్వాన్‌ లోయలో ప్రస్తుత పరిస్థితులను లెఫ్టినెంట్‌ జనరల్‌ యోగేశ్‌ కుమార్‌ జోషి ఆర్మీ చీఫ్‌కు వివరించారు. చైనాతో ఘర్షణలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైనికులకు జనరల్‌ నరవణె ప్రశంసాపత్రాలు అందజేశారు. ఓ వైపు చైనా సైనికాధికారులతో చర్చలు జరుగుతుండగా.. మరోవైపు ఆర్మీ చీఫ్‌ లద్దాఖ్‌లో పర్యటిస్తూ బలగాల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. సరిహద్దులో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని సైనికులకు సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.


ఆర్మీ చీఫ్‌ నరవణెతో లద్దాఖ్‌ ఎంపీ జామ్యాంగ్‌ త్సెరింగ్‌ నాంగ్యాల్‌ కూడా భేటీ అయ్యారు. మన సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు ప్రమా దం పొంచి ఉంటే సహించేది లేదని, పొరుగు దేశానికి తగిన బుద్ధి చెప్పాలని ఎంపీ కోరారు. మరోవైపు సరిహద్దులోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో బుధవారం భారత యుద్ధవిమానా లు నింగికెగిరాయి. మన భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు యత్నించిన చైనాకు వాయుసేన సత్తా చాటేలా గగనతలంలో నిప్పులుచిమ్ముతూ దూసుకెళ్లాయి. లేహ్‌ వైమానికస్థావరం నుంచి బయల్దేరి సరిహద్దులపై నిఘా పెట్టాయి. అలాగే లేహ్‌ సమీపంలో భారీగా సైనిక వాహనాలు, ఆయుధాలు వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు బుధవారం విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్‌ శ్రీవాత్సవ, చైనా విదేశాంగ శాఖలోని డైరెక్టర్‌ జనరల్‌ వూ జియాంగ్‌ఝావోల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌, చైనాలు ప్రధానమైన పొరుగు దేశాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా సరిహద్దులో శాంతియుతంగా ఉండాలని, ప్రశాంతతను కొనసాగించాలంటూ బుధవారం చైనా విదేశాంగ, రక్షణ శాఖలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. అయితే ఈ నెల 15న గల్వాన్‌లో జరిగిన ఘర్షణకు భారత్‌దే బాధ్యతని ఆరోపించాయి. 


ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి: కాంగ్రెస్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ చైనా చొరబాట్లు జరుగుతున్నాయన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ డిమాండ్‌ చేశారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. వాణిజ్యం ద్వారా చైనాను ఎదుర్కోవాలన్నారు.





బుద్ధి మారని చైనా!

చైనా బుద్ధి మారదా..? గల్వాన్‌ లోయలో వివాదం ఇంకా సమసిపోలేదా..? అంటే తాజా ఉపగ్రహ చిత్రాలు అవుననే అంటున్నాయి. గల్వాన్‌ లోయలోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాల కదలికలు మరింత తీవ్రమయ్యాయి. భారీ సంఖ్యలో సైనికులను తరలిస్తుండడంతో పాటు కొత్తగా రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపడుతోంది. సైనికాధికారుల మధ్య జరిగిన ఉన్నతస్థాయి చర్చల్లో సైనికులను ఉపసంహరించాలని నిర్ణయించినా చైనా బలగాలను పెంచుతూనే ఉంది. 

Updated Date - 2020-06-25T07:07:06+05:30 IST