ఆర్మీ చీఫ్ నరవణే దక్షిణ కొరియా పర్యటన షురూ..
ABN , First Publish Date - 2020-12-28T20:57:19+05:30 IST
సైనిక సహకారాన్ని మరింత పెంచుకునేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ ..

న్యూఢిల్లీ: సైనిక సహకారాన్ని మరింత పెంచుకునేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లారు. కోవిడ్ మహమ్మారిని దేశం ఎదుర్కొంటున్న తరుణంలో నరవణే చేపడుతున్న ఐదో విదేశీ పర్యటన ఇది. ఇప్పటికే మయన్మార్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకు నరవణే వెళ్లివచ్చారు. మూడు రోజుల (28-30) దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆ దేశ సీనియర్ మిలటరీ అధికారులతోనూ, ప్రభుత్వాధినేతలతోనూ ఆయన సమావేశమవుతారు.
సియాల్‌లోని వార్ మెమోరియల్‌ను నరవణే సందర్శిస్తారు. కొరియన్ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, డిఫెన్స్ అక్విజిషన్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ (డీఏపీఏ) మంత్రితోనూ ఆయన సమావేశమై ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల పెంపుపై చర్చిస్తారు. గ్వాంగ్వన్‌లోని ఇంజె కౌంటీలో కొరియా కంబాట్ ట్రైనింగ్ సెంటర్‌ను, డయెజియాన్‌లోని డిఫెన్స్ డవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీడీ)ని కూడా ఆయన సందర్శిస్తారు.
ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ గన్ ప్రోగ్రాం కింద 2017 ఏప్రిల్‌లో లార్సెన్ అండ్ టుబ్రో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా టెక్‌విన్ (హెచ్‌టీడబ్ల్యూ) మధ్య 720 మిలియన్ డాలర్ల ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న టలెవగావ్‌లో గన్స్ అసెంబ్లింగ్‌ను ఎల్ అండ్ టీ చేపడుతోంది. భారత అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించిన హెచ్‌టీడ్ల్యూ కే9 థండర్, కే9 వజ్రను ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో మైన్‌స్వీపర్ల తయారీకి ఒక కొరియన్ సంస్థతో ఒప్పందానికి ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. మరో కొరియన్ సంస్థ నుంచి భారత మిలటరీకి బిహో సెల్ఫ్ ప్రొపెల్డ్ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టంను సరఫరా చేసే అవకాశాలపై కసరత్తు జరుగుతోంది.