యుద్ధంలో ఉమ్మడి పోరుకు సైన్యం, వాయు సేన సన్నాహాలు

ABN , First Publish Date - 2020-10-04T23:01:14+05:30 IST

చైనాతో యుద్ధం వస్తే, భారత సైన్యం, వాయు సేన ఉమ్మడిగా పోరాడేందుకు సమాయత్తమవుతున్నాయి. ఓవైపు చైనాను, మరోవైపు పాకిస్థాన్‌ను

యుద్ధంలో ఉమ్మడి పోరుకు సైన్యం, వాయు సేన సన్నాహాలు

న్యూఢిల్లీ : చైనాతో యుద్ధం వస్తే, భారత సైన్యం, వాయు సేన ఉమ్మడిగా పోరాడేందుకు సమాయత్తమవుతున్నాయి. ఓవైపు చైనాను, మరోవైపు పాకిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహాలు చరిస్తున్నాయి. సైన్యానికి అవసరమైన సరుకులు, సామగ్రిని అందజేయడం ఇప్పటికే ప్రారంభించింది. తూర్పు లడఖ్‌లో చైనాను చిత్తు చేసేందుకు వ్యూహాలను రూపొందించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, భారత సైన్యం అధిపతి జనరల్ ఎంఎం నరవనే, వాయు సేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బడౌరియా తరచూ సమావేశమవుతున్నారు. 


యుద్ధంలో సైన్యానికి వాయు సేన సహాయపడటం గురించి సీనియర్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు లడఖ్‌లోని లేహ్‌లో చైనా దళాలకు ఎదురుగా భారత దళాలు ఉన్నాయి. భారత దళాలకు రేషన్ సరుకులు, ఇతర సామగ్రిని వాయు సేన సరఫరా చేస్తోంది. లేహ్ వైమానిక స్థావరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-17లు, ఇల్యూషిన్-76లు, సీ-130జే సూపర్ హెర్క్యులెస్ ఉన్నాయి. సరిహద్దుల వద్దనున్న స్థావరాల వద్దకు సైన్యాన్ని తీసుకెళ్ళడంలో కూడా వాయు సేన సహాయపడుతోంది. 


సైన్యం, ఇతర భద్రతా దళాలు ఎటువంటి సహాయం కోరినా అందజేయాలని వాయు సేన ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. 


సైన్యం కూడా ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను వాయు సేనకు తెలియజేస్తోంది. దీనివల్ల వాయు సేనకు కూడా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదాని గురించి తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితినిబట్టి అవసరమైతే ఉమ్మడిగా కొన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేశారు. 


లడఖ్ సెక్టర్‌లో ఒకేసారి చైనా, పాకిస్థాన్‌లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. లేహ్ నుంచి తూర్పు లడఖ్ వైపు వెళ్ళే మార్గంలో ఇండస్ నదిపై చినూక్‌ హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి. ఇవి సైన్యానికి రేషన్ సరుకులను తీసుకెళ్ళడంతోపాటు సైనికులను కూడా సరిహద్దుల వద్ద దించుతున్నాయి. ట్యాంకులతో యుద్ధం ప్రారంభమైతే అపాచీ హెలికాప్టర్లు పెద్ద ఎత్తున రంగంలోకి దిగబోతున్నాయి. 


Updated Date - 2020-10-04T23:01:14+05:30 IST