కల్వకుర్తి-కరివేన జాతీయ రహదారికి ఆమోదం

ABN , First Publish Date - 2020-10-27T06:44:51+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర

కల్వకుర్తి-కరివేన జాతీయ రహదారికి ఆమోదం

ప్రకటించిన కేంద్రమంత్రి గడ్కరీ

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేస్తామని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి, బీజేపీ నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, పార్టీనేత నెడునూరి దిలీపాచారి సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రూ. 800 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ జాతీయ రహదారిని నిర్మించనుందని, గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీని గడ్కరీ ఇప్పుడు నెరవేర్చారని వారు పేర్కొన్నారు.


తిరుపతి, చెన్నైకి తగ్గనున్న దూరం

జాతీయ రహదారుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన భారతమాల-1 ప్రాజెక్టులోకి కీలకమైన కల్వకుర్తి-కరివేను రహదారిని చేర్చారు. 122 కి.మీ పొడవైన ఈ రహదారిలోనే సోమశిల సిద్ధేశ్వరం వంతెన కూడా ఉంది. దీని పొడవు 3 కిలోమీటర్లు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోతుంది.

మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నై వెళ్లే మార్గంలో 79 కి.మీ మేర దూరం తగ్గుతుందని అంచనా. 12 ఏళ్ల క్రితం వచ్చిన ఈ రహదారి ప్రతిపాదన.. బీజేపీ నేతల చొరవతో మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలో 96 కి.మీ ఉండే ఈ రహదారి.. ఏపీలో 26 కి.మీ ఉంటుంది. 


Updated Date - 2020-10-27T06:44:51+05:30 IST