‘సుప్రీం’ ఉద్యోగికి కరోనా
ABN , First Publish Date - 2020-04-28T06:40:09+05:30 IST
దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా కరోనా వైరస్ పాకింది. సుప్రీం కోర్టు ఉద్యోగి ఒకరికి కరోనా సోకింది. జ్యుడీషియల్ విభాగంలో పనిచేసే ఆ ఉద్యోగి ఈ నెల 16న విధులకు...

- 16న విధులకు.. తర్వాత జ్వరం
- క్వారంటైన్‌లోకి ఇద్దరు రిజిస్ట్రార్లు
- దేశంలో మరో 60 మంది మృతి
- 886కు చేరిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ/పుణె, ఏప్రిల్ 27: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా కరోనా వైరస్ పాకింది. సుప్రీం కోర్టు ఉద్యోగి ఒకరికి కరోనా సోకింది. జ్యుడీషియల్ విభాగంలో పనిచేసే ఆ ఉద్యోగి ఈ నెల 16న విధులకు హాజరయ్యారు. తర్వాత రెండు రోజులు జ్వరంతో బాధపడ్డారు. ఆయనకు కరోనా సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. 16న ఆయన ఇద్దరు రిజిస్ట్రార్లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో స్వీయ క్వారంటైన్‌కు వెళ్లాలని వారిద్దరికీ సూచించారు. 16 నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో పుణె నగరమంతటినీ కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. సోమవారం 84 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పుణె జిల్లాలో మొత్తం కేసులు 1,348కి పెరిగాయి. మరణాలు 80కి చేరాయి.
సిబ్బంది మంత్రిత్వ శాఖ అధికారి మృతి
ఢిల్లీలో సిబ్బంది మంత్రిత్వ శాఖ శిక్షణ విభాగం అధికారి ఒకరు ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో పాత జేఎన్‌యూ ఆవరణలోని శిక్షణ విభాగం భవనానికి అధికారులు సీల్ వేశారు. కార్యాలయ ఉద్యోగులను కొన్ని రోజులు స్వీయ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆయన కరోనా వైర్‌సతో బాధపడుతున్నారా అనేది ఇంకా తెలియదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా రోగులకు వైద్య సేవలందించేందుకు ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ మళ్లీ నర్సు యూనిఫాం ధరించారు. ఇంతకుముందు ఆమె ముంబై నాయర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేవారు.
వర్కింగ్ జర్నలిస్టు మరణిస్తే 15 లక్షలు
కరోనా సోకి ఎవరైనా వర్కింగ్ జర్నలిస్టు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం ఇస్తామని ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. బెంగళూరులో 50 ఏళ్ల కరోనా రోగి సోమవారం విక్టోరియా ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.