దర్యాప్తు ఎలా?

ABN , First Publish Date - 2020-10-07T07:25:48+05:30 IST

సిటింగ్‌, మాజీ చట్టసభల సభ్యులపై దర్యాప్తు తీరుతెన్ను ఎలా ఉందో రెండు వారాల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది...

దర్యాప్తు ఎలా?

  • 2 వారాల్లో సమగ్ర వివరాలు ఇవ్వండి
  • నేర చరిత నేతల దర్యాప్తుపై కేంద్రానికి సుప్రీం తాజా గడువు

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సిటింగ్‌, మాజీ చట్టసభల సభ్యులపై దర్యాప్తు తీరుతెన్ను ఎలా ఉందో రెండు వారాల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. ‘నేరచరితులైన నేతలపై కేసులు ప్రజల నెత్తిన  వేలాడుతున్నాయి.  ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్‌ కేసులను సత్వరం విచారించేందుకు నిర్దిష్టంగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఈ విషయంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకొని మాకు వివరాలు ఇవ్వాలి. ఇవ్వడానికి మేం సిద్ధమే... సత్వరం దీనిపై చర్య తీసుకుంటాం...అని ప్రతీసారీ చెప్పడమే తప్ప ఏమీ చెయ్యడం లేదు’ అని జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. అనంతరం- నేతల కేసుల గురించిన సమగ్ర  వివరాలు మరో రెండు వారాల్లో సమర్పించాల్సిందిగా ధర్మాసనం రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది. అదేవిధంగా సీబీఐ, ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల కింద విచారణ ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధుల కేసుల వివరాలను సమర్పించేందుకు కేంద్రానికి కూడా రెండువారాల సమయం మంజూరు చేసింది. ‘అనేక కేసుల్లో పోలీసులు నేతలపై కేసులు నమోదు చేయడానికి భయపడుతున్నారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని మాకు సమాచారం ఉంది.   వారు చట్టాలు అమలు చేయడం లేదు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. అశ్వనీకుమార్‌ ఉపాథ్యాయ అనే బీజేపీ నేత 2016లో దాఖలు చేసిన ప్రజాహిత దావాపై సాగుతున్న విచారణలో భాగంగా బెంచ్‌ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-10-07T07:25:48+05:30 IST