హత్రాస్ కేసులో ఓ నిందితుడి గురించి మరో సంచలనం

ABN , First Publish Date - 2020-10-04T01:55:01+05:30 IST

హత్రాస్ సామూహిక అత్యాచారం కేసులో కాలం గడుస్తున్నకొద్దీ ఉత్కంఠభరితమైన విషయాలు జనం ముందుకు వస్తున్నాయి.

హత్రాస్ కేసులో ఓ నిందితుడి గురించి మరో సంచలనం

లక్నో : హత్రాస్ సామూహిక అత్యాచారం కేసులో కాలం గడుస్తున్నకొద్దీ ఉత్కంఠభరితమైన విషయాలు జనం ముందుకు వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు నలుగురు కాగా, వీరిలో ఒకడైన రాము ఈ ఘోరం జరిగినపుడు సంఘటన స్థలంలో లేడని, తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీలో విధి నిర్వహణలో ఉన్నాడని తెలుస్తోంది. 


ఓ జాతీయ ఛానల్ వెల్లడించిన వివరాల ప్రకారం, హత్రాస్ కేసులో ఓ నిందితుడు రాము  ఓ డెయిరీ చిల్లర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. ఆయన డబుల్ షిఫ్ట్ జాబ్ మూడు నెలల నుంచి చేస్తున్నాడు. సామూహిక అత్యాచారం జరిగిన రోజు ఆ సంఘటన జరిగిన గ్రామంలో రాము లేడని ఆ ప్లాంట్ యజమాని చెప్పారు. ఆ సంఘటన జరిగిన రోజు రాము తన ప్లాంట్‌లోనే పని చేస్తున్నాడని చెప్పారు. 


తాను మాత్రమే కాదని, తన ప్లాంట్‌లో ఉన్న 25 మందికి పైగా సిబ్బంది, ఇతరులు సెప్టెంబరు 14న రాము తన ప్లాంట్‌లో పని చేస్తుండగా చూశారని చెప్పారు. రాము రెండు షిఫ్టుల్లో పని చేస్తూ ఉంటాడని, ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక షిఫ్టు, సాయంత్రం 5 గంటల నుంచి 9.30 గంటల వరకు రెండో షిఫ్టు అని తెలిపారు. 


ప్లాంట్‌లోని రిజిస్టర్‌లో రాము వచ్చినట్లు ఉందని, దానిని పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. తమ ప్లాంట్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ ఆరు రోజుల్లోనే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతూ ఉంటాయని చెప్పారు. రాముకు వినికిడి లోపం ఉందని, అతని నడవడిక బాగుండేదని చెప్పారు. 


హత్రాస్ బాధితురాలిపై సెప్టెంబరు 14న అగ్ర వర్ణానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారం చేసి, గాయపరచినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రమైన గాయాలతో ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న మరణించారు. 


Updated Date - 2020-10-04T01:55:01+05:30 IST