ఆకలితో బాధపడేవారికి ఏర్పాట్లపై విశ్లేషణ జరగాలి : అఖిలేశ్ యాదవ్
ABN , First Publish Date - 2020-04-08T22:54:28+05:30 IST
రోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం సమయంలో నిర్వాసితులైనవారికి

లక్నో : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం సమయంలో నిర్వాసితులైనవారికి, ఆకలితో బాధపడేవారికి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయో విశ్లేషణ జరగాలని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా సహాయక నిధులపై కూడా విశ్లేషణ అవసరమని తెలిపారు. మర్కజ్ నిజాముద్దీనలో తబ్లిగి జమాత్ కార్యక్రమాలకు హాజరైనవారు పట్టుబడుతున్న నేపథ్యంలో వీసాల జారీ గురించి కూడా పరిశీలన జరగాలని ఆయన పరోక్షంగా కోరారు.
బుధవారం అఖిలేశ్ యాదవ్ ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘విశ్లేషణ చేసేవారు ఇటీవల పట్టుబడుతున్నవారిలో ఎవరికి, ఎందుకు, ఎప్పుడు వీసాలు ఇచ్చారనేదానిని కూడా సదుద్దేశంతో విశ్లేషణ చేయాలి. కరోనా వైరస్ నిర్థరణ పరీక్షలు ఎందరికి జరిగాయి? ఇతర వ్యాధులకు సరైన చికిత్స అందుబాటులో ఉందా? ఆకలితో ఉన్నవారికి, నిరాశ్రయులైనవారికి ఏర్పాట్లు జరిగాయా?’’ అని ప్రశ్నించారు.
సహాయక నిధుల వినియోగంలో పారదర్శకతపై కూడా విశ్లేషణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.