ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి పీఎంవోలో చోటు

ABN , First Publish Date - 2020-09-13T17:55:52+05:30 IST

యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు.

ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి పీఎంవోలో చోటు

ఇంటర్నెట్ డెస్క్: యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా ప్రమోషన్‌తో పీఎంవోలో చోటు సంపాదించారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో పుట్టిన ఆమ్రపాలి..  చెన్నై ఐఐటీ నుంచి బీటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం 2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్‌ను సాధించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించారు. వికారాబాద్ సబ్-కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ కలెక్టర్‌గా, తెలంగాణ ఎన్నిక సంఘం అధికారిణిగా సేవలందించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆమ్రపాలితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను పీఎంవోకు ఎంపిక చేశారు.  వీరిలో మధ్యప్రదేశ్ 2004 కేడర్‌కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్, ఉత్తరాఖండ్ 2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు. Updated Date - 2020-09-13T17:55:52+05:30 IST