పారిశ్రామిక కారిడార్ల‌తో 2.8 లక్షల ఉద్యోగాలు: అమిత్‌షా

ABN , First Publish Date - 2020-12-31T00:12:39+05:30 IST

మోదీ ప్రభుత్వం రూ.7,725 కోట్లతో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై ..

పారిశ్రామిక కారిడార్ల‌తో 2.8 లక్షల ఉద్యోగాలు: అమిత్‌షా

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం రూ.7,725 కోట్లతో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి అభినందనలు తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో 2.8 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్టు ఆయన చెప్పారు.


కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటల తుముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నొయిడాలోని మల్లీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ అండ్ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లకు కేంద్రం అనుమతి తెలిపింది. అనంతరం అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఉత్తేజం కలగడంతో పాటు, దేశవ్యాప్తంగా పెట్టుబడులకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. కాగా, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటులో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని, తయారీరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుందని మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. లాజస్టిక్‌ల ఖర్చు తగ్గడంతో పాటు నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.


కేబినెట్ నిర్ణయాలు..

మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి కూడా కేబినెట్ బుధవారంనాడు ఆమోద ముద్ర వేసింది. మూడు పారిశ్రామిక కారిడార్లను రూ.7,725 కోట్లతో నిర్మించేందుకు నిర్ణయించింది. భారత్-భూటాన్ మధ్య శాంతి భద్రతలకు సంబంధించిన ఎంవోయూకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

Updated Date - 2020-12-31T00:12:39+05:30 IST