అసోంలో అభివృద్ధితో పాటు సైద్ధాంతిక మార్పూ అవసరమే : అమిత్‌షా

ABN , First Publish Date - 2020-12-26T21:38:29+05:30 IST

బోడో టెరిటోరియల్ ప్రాంతీయ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అసోంలో శాంతి నెలకొల్పడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని

అసోంలో అభివృద్ధితో పాటు సైద్ధాంతిక మార్పూ అవసరమే : అమిత్‌షా

గౌహతి : బోడో టెరిటోరియల్ ప్రాంతీయ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అసోంలో శాంతి నెలకొల్పడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఈ ఒప్పందాల కంటే ముందు చేతిలో ఆయుధాలు పట్టిన బోడో యువత... నేడు ఉద్యోగాల్లో చేరి, ప్రధాన జనజీవన స్రవంతిలోకి వచ్చేశారని హర్షం వ్యక్తం చేశారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా జరిగిన ఓ బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొన్నారు. ఒకానొక సమయంలో అసోంలో వివిధ అంశాలపై ఉద్యమాలు తీవ్రంగా జరిగేవని, వందల మంది యువత తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఈ అల్లర్లతో అసోంలో శాంతి మొత్తం అదుపు తప్పిందని, అభివృద్ది స్తంభించిపోయిందని తెలిపారు. రాష్ట్రం ముందుకెళ్లాలంటే అభివృద్ధి ఒక్కటే శరణ్యమని స్పష్టం చేశారు.


ప్రస్తుతానికి అసోంలో అభివృద్ది జరుగుతోందని, రాబోయే రోజుల్లో కూడా అభివృద్ది జరగడం ఖాయమని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధితో పాటు సైద్ధాంతిక మార్పు కూడా అవసరమేనని షా అన్నారు. ఆచార్య శంకర్ దేవ్ జన్మస్థలమైన అసోంకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఆయన సాహిత్యం కోసం ఎంతో శ్రమించారని, కాంగ్రెస్ మాత్రం ఏమీ చేయలేదన్నారు. రాష్ట్ర సాంస్కృతిని, చరిత్రను, భాషను పటిష్ఠపరచాలన్న అంశాలపై బీజేపీకి నమ్మకం ఉందని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని భాషలు, సంస్కృతులు పటిష్టం కానిదే భారత్ ఎలాంటి గొప్పదనాన్నీ సాధించలేదని తమ అభిప్రాయమని అమిత్‌షా ప్రకటించారు. 

Updated Date - 2020-12-26T21:38:29+05:30 IST