పెట్రోల్ ధరలపై వైరల్‌గా మారిన బిగ్‌బీ పాత ట్వీట్!

ABN , First Publish Date - 2020-06-25T21:53:51+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 19 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న సామాన్య భారతీయుడికి..

పెట్రోల్ ధరలపై వైరల్‌గా మారిన బిగ్‌బీ పాత ట్వీట్!

న్యూఢిల్లీ: వరుసగా మూడు వారాల నుంచి పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య భారతీయుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్ రెండూ రూ.80కి చేరుకున్నాయి. ఆ మాటకొస్తే లీటర్ పెట్రోల్ ధర కంటే డీజిల్ ధరే పది పైసలు ఎక్కువగా ఉంది. వాస్తవానికి 2012 ముందునాటి వరకు డీజిల్ ధర పెట్రోల్‌ ధరలో రెండు నుంచి మూడోవంతు మాత్రమే ఉండేది. 2002 నుంచి 2012 మధ్య పెట్రోల్ రిటైల్ ధరలు డీజిల్ రిటైల్ ధర కంటే ఎప్పుడూ మించలేదు. 2010లో డీజిల్ ధర పెట్రోల్‌కంటే 28 శాతం తక్కువగా ఉండగా.. మే 2012 నాటికి ఈ రెండిటి మధ్య ధరల్లో వ్యత్యాసం 79 శాతంగా ఉంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ‘‘రూ.80’’ అనే పదం ట్రెండింగ్‌గా ఉంటూ వచ్చింది. దీంతో తాజాగా నెటిజన్లు 2012 నాటి పెట్రోల్ ధరల పెంపుపై అమితాబ్ బచ్చన్ పోస్టు చేసిన ట్వీట్‌ను వెలికి తీశారు.  అప్పట్లో పెట్రోల్ ధర రూ.8 పెరిగినందుకుగానూ బిగ్‌బీ సైటైర్లు విసిరారు.


పెట్రో మంటపై రగిలిపోయిన ప్రజలు తమ కార్లను ఎలా తగలబెట్టాలనుకుంటున్నారో చెబుతూ అప్పట్లో ఆయన విసిరిన వ్యంగ్యాస్త్రం ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉంది. అమితాబ్ ట్వీట్ ప్రకారం.. ‘‘ఎంత పొయ్యమంటారు సర్ పెట్రోల్’’ అని పంప్ అటెండెంట్ అడుగుతాడు.. ముంబై వాసి దానికి బదులిస్తూ, ‘‘2 లేదా 4 రూపాయల పెట్రోల్ కారు మీద చల్లు బ్రదర్.. తగలపెట్టేస్తాను..’’ అంటాడు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు దీన్ని బయటికి లాగిన నెటిజన్లు ఈ పోస్టుపై తెగ కామెంట్లు గుమ్మరిస్తున్నారు. ‘‘భలే జోక్ సర్.. మళ్లీ ఒకసారి వెయ్యరా ప్లీజ్..’’ అని ఓ నెటిజన్ కోరగా.. ‘‘హలో అబితాబ్ సర్.. మీ ‘జమీర్’ (బిగ్‌బీ హీరోగా వచ్చిన సినిమా) ఇంకా బతికే ఉన్నాడా..’’ అని మరొకరు ప్రశ్నించారు. ‘‘సర్, ఇప్పుడు మీ కారు పెట్రోల్‌తో కాదు.. నీళ్లతో నడుస్తోంది..’’ అని మరొకరు ఛమత్కరించగా.. ‘‘భారతీయ సెలబ్రిటీలు నిజాన్ని ధైర్యంగా మాట్లాడేందుకు ఇదే సరైన సమయం...’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. 



Updated Date - 2020-06-25T21:53:51+05:30 IST