నడ్డాపై దాడి కేసు దర్యాప్తుకు అమిత్ షా ఆదేశాలు

ABN , First Publish Date - 2020-12-11T01:35:29+05:30 IST

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమ

నడ్డాపై దాడి కేసు దర్యాప్తుకు అమిత్ షా ఆదేశాలు

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్‌‌లో జరిగిన దాడిపై దర్యాప్తుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సవివరమైన నివేదికను సమర్పించాలని గవర్నర్‌ను కోరారు. 


జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఆయన గురువారం సౌత్ 24 పరగణాస్‌కు వెళ్తుండగా, ఆయన కాన్వాయ్‌పై రాళ్ళ దాడి జరిగింది. ఈ దాడిలో బీజేపీ నేతలు కైలాశ్ విజయవర్గీయ గాయపడినట్లు ఆ పార్టీ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ స్పందిస్తూ, ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. 


జేపీ నడ్డాపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమిత్ షా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. టీఎంసీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ నిరంకుశ పాలనలో ఉందని ఆరోపించారు. ఈ పరిణామాలు శోచనీయమని పేర్కొన్నారు. శాంతిని ప్రేమించే రాష్ట్ర ప్రజలకు స్పాన్సర్ చేసిన హింసాకాండపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 


పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కూడా మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని తాను అప్రమత్తం చేసినప్పటికీ, చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సౌత్ 24 పరగణాస్‌లోని డైమండ్ హార్బర్‌లో బీజేపీ సమావేశం సందర్భంగా శాంతిభద్రతలు కుప్పకూలే అవకాశం ఉందని తాను గురువారం ఉదయం 8.19 గంటలకు, 9.05 గంటలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశానన్నారు. 


Updated Date - 2020-12-11T01:35:29+05:30 IST