కామాఖ్య ఆలయంలో అమిత్‌షా పూజలు

ABN , First Publish Date - 2020-12-27T20:17:56+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మూడు రోజుల అసోం పర్యటనలో భాగంగా గౌహతిలోని..

కామాఖ్య ఆలయంలో అమిత్‌షా పూజలు

గువహటి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మూడు రోజుల అసోం పర్యటనలో భాగంగా గువహటిలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని ఆదివారంనాడు సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిస్వా శర్మ ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు, శనివారం ఉదయం ఆయన గువహటి చేరుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి సోనోవాల్‌తో జరిపిన సమావేశంలో సమీక్షించారు. అసోం మాజీ మంత్రి, గోలాహట్ ఎమ్మెల్యే అజంతా నియోగ్ సైతం అమిత్‌షాను కలుసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ నియోగ్ ప్రాథమిక సభ్యత్వాన్ని కాంగ్రెస్ ఇటీవల రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె అమిత్‌షాను కలుసుకున్నారు. అనంతరం ఒకటి, రెండు రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు.


కాగా, అమిత్‌షా తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. చురాచాంద్‌పూర్ మెడికల్ కాలేజీ, ఇంఫాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమిత్‌షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - 2020-12-27T20:17:56+05:30 IST