చెన్నైలో అమిత్ షాకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2020-11-21T22:02:28+05:30 IST

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తమిళనాడు

చెన్నైలో అమిత్ షాకు చేదు అనుభవం

చెన్నై : కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తమిళనాడు పర్యటనలో అనూహ్య సంఘటన జరిగింది. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో వెళ్తూ, జీఎస్‌టీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న బీజేపీ, ఏఐఏడీఎంకే కార్యకర్తలకు అభివాదం చేసేందుకు కారు దిగి, నడుస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు ఆయనపైకి ఓ ప్లకార్డును విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్లకార్డు ఆయనపై పడకుండా నిరోధించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆగంతకుడు విసిరిన ప్లకార్డుపై ‘గో బ్యాక్ అమిత్ షా’ అని రాసి ఉంది. ఈ వ్యక్తి చెన్నైకి చెందిన దురైరాజ్ (67) అని పోలీసులు తెలిపారు. 


చెన్నై విమానాశ్రయం బయట ఉన్న జీఎస్‌టీ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు అమిత్ షా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి, తన కారు నుంచి దిగి, రోడ్డుపై నడిచారు. దీంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. 


ఇదిలావుండగా, అమిత్ షా రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటిస్తారు. 2021లో తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చలు జరపడంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. 


Updated Date - 2020-11-21T22:02:28+05:30 IST