మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అమిత్ షా ఫోన్

ABN , First Publish Date - 2020-04-15T02:18:15+05:30 IST

ముంబైలోని బాంద్రాలో వలస కార్మికులు భారీ ఎత్తున గుమిగూడటంపై

మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అమిత్ షా ఫోన్

న్యూఢిల్లీ : ముంబైలోని బాంద్రాలో వలస కార్మికులు భారీ ఎత్తున గుమిగూడటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు అమిత్ షా మంగళవారం ఫోన్ చేసి, ఇటువంటి పరిణామాలు కోవిడ్-19పై పోరుకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. 


ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటం వల్ల భారత దేశం కోవిడ్-19పై చేస్తున్న యుద్ధం బలహీనపడుతుందని అమిత్ షా చెప్పారు. ఇటువంటి సంఘటనలను నిరోధించేందుకు పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 



కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు 21 రోజులపాటు అమలు చేసిన దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం గడువు మంగళవారంతో పూర్తయింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడుతూ అష్ట దిగ్బంధనాన్ని దేశవ్యాప్తంగా మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి ముంబై వచ్చిన కార్మికులు బాంద్రాకు మంగళవారం పెద్ద ఎత్తున చేరుకున్నారు. తాము స్వరాష్ట్రాలకు వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. 


పోలీసులు, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని, వలస కార్మికులకు నచ్చజెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. 


ఇదిలావుండగా శివసేన నాయకుడు, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే మాట్లాడుతూ, వలస కార్మికులను తమ తమ రాష్ట్రాలకు పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోలేకపోతోందన్నారు. బాంద్రా స్టేషన్లో పరిస్థితి అయినా, సూరత్‌లో దొమ్మీకాండ అయినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయ లోపం కారణంగానే జరిగాయని ఆరోపించారు. 


Updated Date - 2020-04-15T02:18:15+05:30 IST