ఆర్థిక కష్టాల్లో అమెరికన్లు
ABN , First Publish Date - 2020-12-28T07:26:14+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనం.. రాత్రికి రాత్రే కోట్లాది మంది అమెరికన్లను ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. కరోనా విపత్తు నిర్వహణ, ప్యాకేజీ కొనసాగింపునకు సంబంధించిన 2.3ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.1.6 కోట్ల కోట్లు) బిల్లుపై సంతకం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా...

- కరోనా బిల్లుపై ట్రంప్ కొర్రీనే కారణం
- వారం క్రితం ఒప్పుకుని.. ఇప్పుడు సంతకానికి నిరాకరణ
వాషింగ్టన్, డిసెంబరు 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనం.. రాత్రికి రాత్రే కోట్లాది మంది అమెరికన్లను ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. కరోనా విపత్తు నిర్వహణ, ప్యాకేజీ కొనసాగింపునకు సంబంధించిన 2.3ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.1.6 కోట్ల కోట్లు) బిల్లుపై సంతకం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా నిరాకరించారు. ఈ భారీ ప్యాకేజీకి గత వారం ఆయన ఒప్పుకొన్నారు. అయితే, తీరా బిల్లు ఆయన వద్దకు వెళ్లేసరికి.. దానిలో అమెరికన్లకు మేలు చేకూర్చే నిధులు స్వల్పంగా ఉన్నాయని, ఇతర కేటాయింపులే అధికంగా ఉన్నాయంటూ సంతకం చేయడానికి తిరస్కరించారు. తాను 2వేల డాలర్లు(రూ.లక్షా 47వేలు) చొప్పున ఇవ్వాలనకున్నానని.. కానీ, బిల్లులో 600డాలర్లు(రూ.44వేలు) మాత్రమే కేటాయించారని.. క్రిస్మస్ సందర్భంగా తాను విడిది చేసిన ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ నుంచి ట్వీట్ చేశారు. ట్రంప్ నిర్ణయంతో దాదాపు కోటి 10లక్షల మంది అమెరికన్లు అవస్థల్లో పడ్డారు. పైగా.. కరోనా నేపథ్యంలో నిరుద్యోగులకు అందించే ప్రత్యేక ఆర్థిక సహాయ గడువు ఈ నెల 26తో ముగిసింది. దీని కొనసాగింపునకు సంబంధించిన నిధుల మంజూరు అనుమతి కూడా అదే బిల్లులో ఉంది. దీంతో దాదాపు 1కోటి 40లక్షల మంది నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రోజు వారీ విపత్తు నిర్వహణ ఖర్చులకూ ఇబ్బంది ఏర్పడనుంది. సంతకం నిరాకరించడంపై అటు ట్రంప్ స్వపక్షమైన రిపబ్లికన్లు.. ఇటు విపక్షమైన డెమోక్రాట్లు నివ్వెరపోయారు. శ్వేతసౌధ అధికారులు కూడా విస్మయంలో మునిగిపోయారు. క్రిస్మస్ పర్వదినాల్లో ప్రజలు వీధుల పాలయ్యే పరిస్థితిని ట్రంప్ కల్పిస్తున్నారని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ విమర్శించారు. బాధ్యతలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. చదరంగంలో తాము పావుల కింద మారామని ఇండియానా రాష్ట్రంలోని సౌత్‌బెండాకు చెందిన లానెట్రిస్ హెయిన్స్ ఆవేదన చెందారు.