గర్భిణుల మీద కరోనా ప్రభావంపై అమెరికా శాస్త్రజ్ఞుల అధ్యయనం
ABN , First Publish Date - 2020-09-03T08:36:51+05:30 IST
గర్భిణుల్లో కొవిడ్-19 వ్యాప్తి, ప్రభావాన్ని పరిశీలించేందుకు భారత్ సహా ఏడు దేశాల్లో అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ శాస్త్రజ్ఞులు అధ్యయనం చేయనున్నారు...

- భారత్ సహా ఏడు దేశాల్లో
వాషింగ్టన్, సెప్టెంబరు 2: గర్భిణుల్లో కొవిడ్-19 వ్యాప్తి, ప్రభావాన్ని పరిశీలించేందుకు భారత్ సహా ఏడు దేశాల్లో అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ శాస్త్రజ్ఞులు అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా.. గర్భధారణ సమయంలో వైరస్ బారిన పడినవారిని, వారికి పిల్లలు పుట్టాక మరో ఏడాదిపాటు పరిశీలిస్తారు. వైరస్ సోకని గర్భిణుల్లో, గర్భస్థ, నవజాత శిశువులతో పోలిస్తే.. వైరస్ సోకిన మహిళలు, వారి గర్భస్థ శిశువులు, పుట్టిన పిల్లల్లో ఏవైనా సమస్యలున్నాయా అనే అంశంపై అధ్యయనం చేస్తారు. ఇందుకు భారత్‌తో పాటు వారు ఎంచుకున్న మిగతా దేశాలు.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, కెన్యా, జాంబియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గ్వాటెమాలా. కాగా, కరోనా బారిన పడినవారిలో యాంటీబాడీలు మూడు నెలల్లోపే ఉంటాయని గత పరిశోధనలు తెలపగా.. కాదు, కనీసం నాలుగు నెలల దాకా ఉంటాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు.