అమెరికా రాజకీయాల్లో కరోనా మలుపు
ABN , First Publish Date - 2020-09-04T02:24:11+05:30 IST
అమెరికాలో ఇప్పుడు కరోనా రాజకీయ మలుపు తీసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం..

అమెరికాలో ఇప్పుడు కరోనా రాజకీయ మలుపు తీసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైకి సీడీసీ కనిపిస్తున్నా.. దాని వెనుక ట్రంప్ సర్కారు ఉందన్నది బహిరంగ రహస్యమే. అమెరికాలో నవంబర్ డెడ్‌లైన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అది కరోనా వ్యాక్సిన్ కోసం విధించిన డెడ్‌లైన్. ముందుగా నిపుణులు నిర్ధారించిన ప్రకారం జనవరిలో టీకా అందుబాటులోకి రావాల్సిఉంది. కానీ, ట్రంప్ ప్రభుత్వం నవంబర్‌లోనే మార్కెట్‌లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తోంది.
అమెరికాలో ఉన్నట్టుండి కరోనా వ్యాక్సిన్ ప్రధాన అంశంగా మారింది. వ్యాక్సిన్ తయారీపై వాడివేడి చర్చసాగుతోంది. ఇన్నాళ్లు కరోనా పాజిటివ్ కేసులు,మరణాలు.. వాటిని అరికట్టడం చుట్టూ పరిస్థితులు తిరిగితే.. ఇప్పుడు వ్యాక్సిన్ తయారీ, మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడంపై ట్రంప్ సర్కారు సీరియస్‌గా దృష్టిపెట్టింది. నవంబర్ 1వ తేదీ నాటికి కరోనా టీకాను పంపిణీ చేసుకునేందుకు సిద్ధమవ్వాలంటూ ట్రంప్ ప్రభుత్వం అమెరికా రాష్ట్రాలకు సూచించినట్టు తెలుస్తోంది. అమెరికాలోని అంటువ్యాధుల నివారణ సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ -సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆగస్టు 27వ తేదీన రాష్ట్రాల గవర్నర్లకు రాసిన లేఖలో ఇందుకు సంబంధించి పలు సూచనలు చేసినట్టు సమాచారం.
వ్యాక్సిన్ పంపిణీ కోసం సీడీసీతో ఒప్పందం కుదుర్చుకున్న మెక్ కీసన్ అనే సంస్థ ఆయా రాష్ట్రాల అనుమతి కోసం స్థానిక ప్రభుత్వాలను త్వరలో సంప్రదిస్తుందని సీడీసీ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారని చెబుతున్నారు. త్వరగా అనుమతులు జారీ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కావాలని ఆయన కోరారని చర్చ జరుగుతోంది. నవంబర్ 1వ తేదీ కల్లా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యే విధంగా.. మెక్ కీసన్‌కు కావాల్సిన మినహాయింపులు ఇచ్చే విషయాన్ని పరిశీలించి, అనుమతుల జారీని వేగవంతం చేయాలని ఆయన రాష్ట్రాలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్రాలు ఇవ్వబోయే ఈ మినహాయింపులేవీ ప్రజారోగ్య పరంగా ఎటువంటి సమస్యలూ సృష్టించవని ఆయన లేఖలో హామీ కూడా ఇచ్చారని సమాచారం. ఈ మేరకు అమెరికా మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. నవంబర్, డిసెంబర్ నాటికి ఒకటో రెండో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావచ్చు అని సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ మీడియాతోనూ వ్యాఖ్యానించారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
వాస్తవానికి అమెరికాలో జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనల పురోగతి ఆధారంగా జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తందని అందరూ అంచనా వేస్తున్నారు. కానీ, తాజా పరిణామాలను చూస్తే రెండు నెలల ముందుగానే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని ఒకరకంగా నిర్బంధంగా చెబుతున్నారు. అంటే.. ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నాలు అమెరికాలో సీరియస్‌గా జరుగుతున్నాయి.
అయితే ఇంత హడావిడిగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి అమెరికా మీడియాలో ఆక్టోబర్ సర్‌ప్రైజ్ అనే పేరు పెట్టారు.
ఈ హడావిడికి కారణం అధ్యక్ష ఎన్నికలే అన్న చర్చ అమెరికాలో జరుగుతోంది. ఎన్నికల సమయానికి ముందుగానే టీకాను మార్కెట్‌లోకి తేవాలన్న ఉత్సాహంలో ఫెడరల్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ ప్రయత్నాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఒత్తిడితోనే ఈ లేఖ రాసినట్లు అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ప్రభుత్వం కరోనా టీకాను మార్కెట్లోకి వదిలిందన్న చర్చ జరిగితే ఎన్నికల్లో లబ్ది చేకూరుతుందన్న ఆలోచనతోనే ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే వైద్య నిపుణులు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టీకా క్లీనికల్ ట్రయల్స్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కొన్ని టీకా తయారీ సంస్థలు ఇంకా వలంటీర్లను నమోదు చేసుకునే దశలోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నెల రోజుల తేడాతో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండా తొందరపడితే విపరిణమాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ వ్యాక్సిన్‌లను మార్కెట్‌లోకి అందుబాటులోకి తేవాలని ఒత్తిడి తేవడం సరైంది కాదంటున్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. ఇలాంటి చర్యలు తీసుకుంటే.. పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
కాగా, అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు 62 లక్షల 91 వేలకు పైగా నమోదయ్యిది. ఇప్పటికే లక్షా 90 వేల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే సంభవించాయి. ఈ పరిణామాలు కూడా అమెరికా సర్కారు వ్యాక్సిన్ గడువుకన్నా ముందే తెచ్చేందుకు ప్రేరేపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కరోనా వ్యాక్సిన్ పనులు అమెరికాలో వేగవంతం చేస్తున్నట్లు అర్థమవుతోది.
- సప్తగిరి గోపగాని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి