అమెరికాలో కరోనా ప్రళయానికి కారణం ఇదేనా...

ABN , First Publish Date - 2020-04-05T23:30:52+05:30 IST

ప్రస్తుతం కరోనా తుఫాన్‌లో పడి కకావికలమైపోతోంది. ముఖ్యంగా న్యూయార్క్ అమెరికా మొత్తంలో కరోనాకు కేంద్రంగా మారింది. మరి ఇంతటి దారుణ స్థతి ఎలా దాపురించింది. తప్పు ఎక్కడ జరిగింది? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక సవివరమైన కథనాన్ని ప్రచురించింది.

అమెరికాలో కరోనా ప్రళయానికి కారణం ఇదేనా...

వాషింగ్టన్: అమెరికా.. అంటే అగ్రరాజ్యం. ఆర్థికంగా ఎంతో ఎత్తులో ఉన్న దేశం. ప్రజల సౌకర్యాల విషయంలో అత్యధిక ప్రమాణాలు పాటించే దేశంగా అమెరికాకు పేరుంది. అటువంటి ధనిక రాజ్యం..ప్రస్తుతం కరోనా తుఫాన్‌లో పడి కకావికలమైపోతోంది. ముఖ్యంగా న్యూయార్క్.. అమెరికా మొత్తంలో కరోనాకు కేంద్రంగా మారింది. మరి ఇంతటి దారుణ స్థతి ఎలా దాపురించింది. తప్పు ఎక్కడ జరిగింది? ఇటువంటి ప్రశ్నలకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక సవివరమైన కథనాన్ని ప్రచురించింది.


అమెరికాలో ప్రయాణాలపై ఆంక్షలు విధించకముందు లక్షల మంది చైనా నుంచి అగ్రరాజ్యానికి వచ్చినట్టు సమాచారం. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఇలా అమెరికాలోకి ప్రవేశించగా.. వీరిలో వుహాన్ నుంచి  వచ్చిన వారి సంఖ్య వేలల్లో ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మొత్తం 1700 విమానాల్లో అమెరికాలోని 17 నగరాలకు వీరందరూ చేరుకున్నారని తెలిపింది. ఇక ట్రంప్ ప్రయాణ ఆంక్షలు విధించిన తరువాత కూడా దాదాపు 40 వేల మంది అమెరికాలో ప్రవేశించారట. మరోవైపు.. చైనా నుంచి వస్తున్న ప్రయాణికుల తనిఖీల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆ పత్రిక పేర్కొంది. జనవరిలో తొలి రెండు వారాల వరకూ కూడా చైనా నుంచి వచ్చిన వారి లో ఏ ఒక్కరినీ వైరస్‌కు సంబంధించిన స్క్రీనింగ్ చేయలేదని తెలుస్తోంది.


పరిస్థతి ఇలా ఉంటే.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తాము చేపట్టిన చర్యల వల్లే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని పలు మార్లు చెప్పుకురావడం గమనార్హం. అయితే అమెరికాలో జనవరి 20న తొలి కరోనా కేసు నమోదవగా..ఇప్పటి వరకూ కరోనా సోకినా తొలి వ్యక్తి అమెరికాలోకి ఎలా ప్రవేశించారనే సమాచారం లేకపోవడం.. అక్కడి పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టినట్టు చెబుతోంది.

Updated Date - 2020-04-05T23:30:52+05:30 IST