కరోనాతో అమెరికా, ఐరోపా విలవిల

ABN , First Publish Date - 2020-03-12T07:53:05+05:30 IST

రోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 1,22,235కు చేరగా మరణాల సంఖ్య 4,386కు పెరిగింది. వందకు పైగా దేశాలకు విస్తరించిన ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ...

కరోనాతో అమెరికా, ఐరోపా విలవిల

  • నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న అగ్రరాజ్యం
  • ఇప్పటికే 36 రాష్ట్రాల్లో వ్యాప్తి.. 32 మంది మృత్యువాత
  • బ్రిటన్‌, ఇరాన్‌ ఆరోగ్య మంత్రులకు కరోనా
  • లండన్‌లో ఆహార కొరత.. 70 శాతం జర్మనీలోనూ వ్యాప్తి
  • ఇటలీ, కువైత్‌లలో చిక్కుకుపోయిన తెలుగువారు
  • ఇరాన్‌లో ఒక్కరోజే వెయ్యిమందికి వైరస్‌


వాషింగ్టన్‌, మార్చి 11: కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 1,22,235కు చేరగా మరణాల సంఖ్య 4,386కు పెరిగింది. వందకు పైగా దేశాలకు విస్తరించిన ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ‘ప్రపంచ మహమ్మారి’ గా ప్రకటించింది. ఇది ప్రపంచానికే పెనుభూతమని అనేక దేశాలు నినదిస్తున్నా ప్రకటించడానికి ఈ సంస్థ నిరాకరించింది. చైనాను మింగేసిన కరోనా వైరస్‌ ఇప్పు డు అమెరికా, ఐరోపా దేశాలను కబళించజూస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. అమెరికాలో మృతుల సంఖ్య 32కు పెరిగింది.


36 రాష్ట్రాలకు విస్తరించింది. మరో 1016 మందికి సోకి ప్రస్తుతం ఏకాంతంలో ఉన్నారు. జనవరి చివర్లోనే తొలి కేసు నమోదైనా, డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరించినా ఫెడరల్‌ అధికారులు పెడచెవిన పెట్టారు. వారంలోగా లక్ష కిట్లు సిద్ధమవుతాయని ప్రకటించిన ట్రంప్‌ ఆ తరువాత ఊసెత్తలేదు. బ్రిటన్‌లో ఒక్కరోజే వెయ్యి కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 8కి పెరిగింది. సాక్షాత్తూ దేశ ఆరోగ్యమంత్రి నాడిన్‌ డోరీ్‌సకూ ఇది సోకింది. ప్రసుత్తం ఆమె ఇంటివద్దే ఏకాంతంలో ఉన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు 30 బిలియన్‌ పౌన్ల ఉద్దీపన ప్యాకేజీని ఆర్థికమంత్రి రిషి శౌనక్‌ ప్రకటించారు. ఆహా ర కొరత ఏర్పడనుందన్న భయంతో ప్రజలు నిత్యావసరాలను హడావిడిగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌ సాంస్కృతిక శాఖ మంత్రి ఫ్రాంక్‌ రీస్టర్‌కు కూడా కరోనా సోకింది. ఆయనను క్వారంటైన్‌ చేశా రు. మరో నలుగురు ఎంపీలు సహా 1606 మందికి సోకింది. ఇప్పటిదాకా ఫ్రాన్స్‌లో 33 మంది చనిపోయారు. 


ఇటలీ... విలవిల

ఇటలీలో మృతుల సంఖ్య ఒక్కరోజులోనే 463 నుంచి 631కు పెరిగింది. 10,419 మందికి ఇది సోకింది. క్షణక్షణానికీ పెరుగుతోంది. దేశమంతటా లాకౌట్‌ ప్రకటించడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆఫీసులు, స్కూళ్లు, వ్యాపార సంస్థలు మూసేశారు.కరోనా సోకి మరణించిన ఓ రోగి ఖననానికి అధికారులు నిరాకరించడంతో ఆమె మృతదేహాన్ని 36 గంటల పాటు ఇంట్లోనే ఉంచేశారు. పెళ్ళి ళ్లు, ఇతర సామాజిక ఉత్సవాలపైనా నిషేధం విధించారు. మరోపక్క జర్మనీలో 70ు జనాభాకు ఇది సోకవచ్చని ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ అన్నారు.


దక్షిణ కొరియా ఆదర్శమా?

వైరస్‌ వ్యాప్తి నియంత్రణ లో దక్షిణ కొరియా ప్రపంచా నికి ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ 7755 కేసులు నమోదుకాగా మృతుల సంఖ్య 60 మాత్రమే! ఈ వైరస్‌ వ్యాప్తి అరికట్టడానికి చైనా లాక్‌డౌన్‌ ప్రకటించగా దక్షిణ కొరియా మాత్రం ప్రజలను చైతన్యవంతం చేయడం, ప్రజా భాగస్వామ్యం, విస్తృత స్థాయిలో పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టింది. కరోనా లక్షణాలని తేలగానే సదరు రోగిని హుటాహుటి ఏకాంతానికి పంపేస్తూ వచ్చింది. సౌదీ అరేబియాలోని ఓ చమురు కంపెనీ క్రూరంగా వ్యవహరించింది. తమ వద్ద పనిచేస్తున్న ఓ విదేశీ వలస కార్మికుడిని హ్యూమనాయిడ్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ డిప్లాయర్‌గా మేకప్‌ చేసింది. ఆ వ్యక్తి దక్షిణాసియా ప్రాంతీయుడిగా (భారతీయుడు ?) చెబుతున్నారు. ఇది జాతి వివక్ష అని నెటిజన్లు మండిపడ్డారు. 


వుహాన్‌లో జీ జిన్‌పింగ్‌

కరోనా వైర్‌సకు కేంద్ర స్థానమైన వుహాన్‌లో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పర్యటించారు. మాస్క్‌ ధరించి వ్యాధి తీవ్రంగా ఉన్న ఓ తాత్కాలిక ఆసుపత్రి లోపలికి వెళ్లి పరిస్థితిని చూశారు. ప్రజలనూ కలిశారు. చైనాలో తాజాగా 22 మరణాలు చోటు చేసుకున్నప్పటికీ ఇవి ఊహించినవే.. ఇంతదాకా 3158 మంది చనిపోయారు. మరోవైపు- ఇరాన్‌లో తాజాగా 63 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 354కు పెరిగింది. దేశ ఆరోగ్య శాఖ సహాయమంత్రి ఇరాజ్‌ హరీర్చికి కూడా ఇది సోకింది.

Updated Date - 2020-03-12T07:53:05+05:30 IST