అమెరికా.. ఆగని మృత్యు కేక

ABN , First Publish Date - 2020-04-24T07:14:18+05:30 IST

అగ్ర రాజ్యం అమెరికాలో ఈ వారం ప్రారంభంలో తగ్గినట్లే తగ్గిన కరోనా మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం మరో 2,416 మంది వైర్‌సతో

అమెరికా.. ఆగని మృత్యు కేక

  • మూడో రోజూ 2 వేల మందిపైనే మృతి!..
  • న్యూయార్క్‌లో పిల్లులకు వైరస్‌
  • డబ్ల్యూహెచ్‌వోకు 227 కోట్లు..
  • అమెరికా నిలిపివేతతో చైనా సాయం
  • వలసల నిషేధ ఉత్తర్వుపై సంతకం
  • అమెరికా దాడికి గురైంది’ అని ట్రంప్‌ వ్యాఖ్య
  • సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి


వాషింగ్టన్‌, న్యూయార్క్‌, సింగపూర్‌, ఏప్రిల్‌ 23: అగ్ర రాజ్యం అమెరికాలో ఈ వారం ప్రారంభంలో తగ్గినట్లే తగ్గిన కరోనా మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం మరో 2,416 మంది వైర్‌సతో చనిపోయారు. దీంతో వరుసగా మూడో రోజూ 2 వేల మంది పైనే ప్రాణాలు కోల్పోయినట్లైంది. అయితే, ఒక్కో రాష్ట్రం క్రమంగా కోలుకుంటోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కరోనా రూపంలో అమెరికాపై దాడి జరిగింద తీవ్ర వ్యాఖ్య చేశారు. భారీ ఉద్దీపన పథకం నేపథ్యంలో రుణభారం పెరిగిపోతుండటంపై మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ‘మనం దాడికి గురయ్యాం. ఇది కేవలం ఫ్లూ కాదు. 1917 తర్వాత ఇలాంటిది ఎవరూ చూడలేదు’ అని అన్నారు. ‘చైనా సహా ఎవరికీ లేనంతటి,  అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ మనది. మూడేళ్లుగా దీనిని మనం నిర్మించుకున్నాం. అకస్మాత్తు దెబ్బ నుంచి కోలుకునేందుకు కొంత డబ్బు వెచ్చించక తప్పదు’ అని ట్రంప్‌ విశ్లేషించారు. అమెరికాలోకి వలసలను 60 రోజుల పాటు నిలిపివేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. అమెరికన్లు కోల్పోయిన ఉద్యోగాలు వలసదారులతో భర్తీ కావడం సరికాదని అన్నారు. ట్రంప్‌ చర్యను సవాల్‌ చేస్తానని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటీటియా జేమ్స్‌ ప్రకటించారు. ఈ పరిణామాలతో మనపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని భారత్‌ తెలిపింది.


ఆ ఆస్పత్రులు, వైద్యులకు సాయం

బీమా లేని కరోనా రోగులకు చికిత్స చేసే ఆస్పత్రులు, వైద్యులు.. బిల్లులను ప్రభుత్వానికి నేరుగా పంపేలా అమెరికా ప్రత్యేక పథకం తీసుకురానుంది. న్యూయార్క్‌ నగరంలో కరోనా బాధితుల్లో 20 శాతం మంది మృతిచెందగా, వీరిలో 88 శాతం వెంటిలేటర్‌ పైన ఉన్నవారేనని ఓ అధ్యయనం పేర్కొంది.  


సింగపూర్‌లో మళ్లీ వెయ్యిపైనే కేసులు

సింగపూర్‌లో భారత సంతతికి చెందిన నిర్మాణ కార్మికుడు(46) కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. గురువారం 1,037కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో 742కొత్త కేసులు రాగా, 15మంది ప్రాణాలు కోల్పోయారు. టీకాను కనుగొనడంలో ఉమ్మడిగా కదులుదామని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌  పిలుపునిచ్చారు. యూకేలో వైరస్‌ బారినపడి కొత్తగా 638 చనిపోయారు. మొత్తం మృతులు 18,738 మందిలో భారతీయులు 420 మంది ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో గతవారం 16వేల కేసులే ఉండగా.. ఇప్పుడవి 43ు పెరిగి 26 వేలకు చేరాయి. స్పెయిన్‌లో మరో 440 మంది మృతిచెందారు. చైనాలో కొత్తగా ధ్రువీకృతమైన 27 సహా లక్షణాలు కపించని కేసులు 984కు చేరాయి. 


స్పానిష్‌ ఫ్లూ గట్టెక్కి.. కరోనా చేతిలో ఓడాడు

ఫిలిప్‌ కహన్‌ (100). సరిగ్గా స్పానిష్‌ ఫ్లూ విజృంభిస్తున్న (1918-19) కాలంలో 1919 డిసెంబరులో కవల పిల్లల్లో ఒకడిగా పుట్టాడు. వీరిలో రెండోవాడైన శామ్యూల్‌ కహన్‌.. ఫ్లూ బారినపడి అప్పుడే ప్రాణాలు కోల్పోయాడు. బతికి బట్టకట్టిన ఫిలిప్‌.. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగం తర్వాత జరిగిన గగనతల సర్వేల్లో పాల్గొన్నాడు. అలాంటి ఫిలిప్‌ కరోనాతో మృతి చెందాడు. ‘స్పానిష్‌ ఫ్లూ వంటి ఉపద్రవం మరోటి వస్తుందని.. కరోనా గురించి మాతాత ముందే ఊహించాడు’ అని ఫిలిప్‌ మనమడు జిస్మన్‌ తెలిపాడు. 


‘బోరిస్‌’ అనే పిలవమన్నారు

కరోనాతో ఐసీయూలో చేరిన సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఎలా ఉన్నారు? అనే వివరాలను ఆయనకు చికిత్స చేసిన పురుష నర్సు లూయీస్‌ పితర్మా (29) వివరించాడు. ‘విషయం తెలిసి నేను కొంత ఇబ్బందిగా భావించా. కానీ, ప్రధాని తీరుతో అదంతా పోయింది. తనను బోరిస్‌ అనే పిలవమని చెప్పేవారు. ఐసీయూలో మూడు రోజులు చికిత్స పొందారు. ఇప్పుడదంతా తలుచుకుంటే నాకు గర్వంగా ఉంది’ అని తెలిపాడు. పోర్చుగల్‌కు చెందిన లూయీస్‌, న్యూజిలాండ్‌ సంతతి వ్యక్తి జెన్సీ మెక్‌గీ.. బోరిస్‌ జాన్సన్‌కు వైద్యం అందించారు.


ఫిబ్రవరి 6నే అమెరికాలో తొలి మరణం!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 6న శానో్‌సకు చెందిన మహిళ పాట్రిసియా డౌడ్‌, 17వ తేదీన  ఓ పురుషుడి మరణానికి కరోనానే కారణమని తేలడం కలకలం రేపుతోంది. వైర్‌సతో తొలి మరణం ఫిబ్రవరి 26న వాషింగ్టన్‌లో నమోదైందని అమెరికా ప్రకటించింది. అయితే, పరీక్ష సామగ్రి సరిపడా లేకపోవడం, ఫెడరల్‌ ప్రభుత్వ మార్గదర్శకాలు కొరవడటంతో కాలిఫోర్నియా మరణాలు లెక్కలోకి రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనా ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో విస్తరించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. న్యూయార్క్‌లో రెండ్లు పిల్లులకు కరోనా పాజిటివ్‌ తేలింది. అమెరికాలో పెంపుడు జంతువులకు కొవిడ్‌ సోకిన ఘటన ఇదే మొదటిది.

Updated Date - 2020-04-24T07:14:18+05:30 IST