బహిరంగంగా ఒప్పుకుంటున్నా, ఉగ్రవాదులపై పాక్ చర్యలు శూన్యం : భారత్

ABN , First Publish Date - 2020-11-13T19:34:28+05:30 IST

ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిని భారత దేశం తీవ్రంగా

బహిరంగంగా ఒప్పుకుంటున్నా, ఉగ్రవాదులపై పాక్ చర్యలు శూన్యం : భారత్

న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిని భారత దేశం తీవ్రంగా తప్పుబట్టింది. ముంబై దాడుల సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 26/11 ముంబై దాడుల కుట్రదారులు, సూత్రధారులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని, ఆ విషయాన్ని స్వయంగా పాకిస్థానే అంగీకరించిందని, అయినప్పటికీ ఆ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టింది. 


2008 నవంబరు 26న ముంబైపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 15 దేశాలకు చెందిన 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. 


ఇదిలావుండగా, పాకిస్థాన్ ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్, హై ప్రొఫైల్ టెర్రరిస్టుల జాబితాను విడుదల చేసింది. ముంబై దాడుల్లో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. దీనిపై భారత దేశం స్పందిస్తూ, ముంబై ఉగ్రవాద దాడుల బాధితులకు న్యాయం చేయాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది.


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ స్పందిస్తూ, 26/11 ముంబై దాడులు జరిగి 12 సంవత్సరాలవుతోందన్నారు. 15 దేశాలకు చెందిన 166 మంది బాధితుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగడం లేదన్నారు. భారత దేశం అందజేసిన సాక్ష్యాధారాలతోపాటు, స్వయంగా పాకిస్థాన్ బహిరంగంగా ధ్రువీకరించినప్పటికీ, అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు అందుబాటులో ఉన్నప్పటికీ పాకిస్థాన్ న్యాయం చేయడం లేదని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని తెలిపారు. ముంబై ఉగ్రవాద దాడుల విచారణలో అంతర్జాతీయ బాధ్యతలను నిర్వహించడంలో అస్పష్టమైన, జాప్యం చేసే విధానాలను వదిలిపెట్టాలని పాకిస్థాన్‌ను భారత దేశం పదే పదే కోరుతోందన్నారు. పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఆ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్, హై ప్రొఫైల్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసిందని తెలుస్తోందన్నారు. ఈ జాబితాలో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థాన్ జాతీయుల పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఈ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


ఐక్య రాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థల  జాబితాలో లష్కరే తొయిబా ఉందని, ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదుల పేర్లు కూడా పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విడుదల చేసిన జాబితాలో ఉన్నాయన్నారు. ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్‌లోనే ఉందన్నారు. ముంబై దాడుల కోసం ఉపయోగించిన పడవ సిబ్బంది పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నప్పటికీ, ఈ దాడుల సూత్రధారి, ఇతర కీలక కుట్రదారుల పేర్లను వదిలిపెట్టారని అన్నారు. ఈ దాడుల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడులకు కుట్ర అమలు పాకిస్థాన్‌ నుంచే జరిగిందన్నారు. 


Updated Date - 2020-11-13T19:34:28+05:30 IST