కరోనా పిడికిలిలో భారత్‌

ABN , First Publish Date - 2020-03-24T09:39:12+05:30 IST

చక్రం తిరగలేదు.. దుకాణం తెరుచుకోలేదు.. ఆఫీసు తలుపులు మూసే ఉన్నాయి. తోపుడు బళ్లు కానరాలేదు. చాలా అరకొరగా జనసంచారం. హోటళ్లు, తినుబండారపు స్టాళ్లన్నీ.....

కరోనా పిడికిలిలో భారత్‌

  • 9 మంది మృతి...
  • 478 కేసులు..
  • 20 రాష్ట్రాలు లాక్‌డౌన్‌


న్యూఢిల్లీ, మార్చి 23: చక్రం తిరగలేదు.. దుకాణం తెరుచుకోలేదు.. ఆఫీసు తలుపులు మూసే ఉన్నాయి. తోపుడు బళ్లు కానరాలేదు. చాలా అరకొరగా జనసంచారం. హోటళ్లు, తినుబండారపు స్టాళ్లన్నీ 80 శాతం బంద్‌!  జనం ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా ధాటికి భారతావని మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా దాదాపుగా కర్ఫ్యూ వాతావరణమే. పరిస్థితి విషమించి న వేళ.. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సర్వం మూతపడ్డాయి. అధికారిక సమాచారం ప్రకారం 20 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా అమలయింది.


మరో 6 రాష్ట్రాల్లో పాక్షికంగా షట్‌డౌన్‌ అమలైంది.  కరోనా మృతుల సంఖ్య 9 కి పెరిగింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన డమ్‌డమ్‌లో ఓ 57-ఏళ్ల వ్యక్తి వైరస్‌ సోకి చనిపోయాడు. ఇతను విదేశీ ప్రయాణాలు చేయకపోయినా వ్యాధిబారిన పడ్డాడు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఈ మధ్యే  అమెరికా నుంచి తిరిగివచ్చిన, టిబెట్‌కు చెందిన ఓ శరణార్థి  కరోనా లక్షణాలతో చనిపోయాడు. ఇక ముంబైలో కరోనా సోకి, నయమై, డిశ్చార్జి అయిన, ఫిలిప్పీన్స్‌కు చెందిన 68-ఏళ్ల వ్యక్తికి మళ్లీ కరోనా సోకి సోమవారం మరణించాడు.  అయితే ఇది కరోనా వల్లా కాదా అన్నది కేంద్రం ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. 


దేశవ్యాప్తంగా  కేసుల సంఖ్య 478కు చేరింది. ఒక్క కేరళలోనే 28 మందికి, మహారాష్ట్రలో 15 మందికి తాజాగా కరోనా సోకింది. మహారాష్ట్రలో 8 మందికి పాజిటివ్‌గా తేలడం తో కేసుల సంఖ్య 97కు పెరిగింది.  వీరిలో 402 మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 24 మందికి నయమై డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల్లో 41 మంది విదేశీయులు. సోమవారం ఉదయం 10 గంటల దాకా 18, 383 మంది నమూనాలను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కాగా, కేసుల సంఖ్య 497కు పెరిగినట్లు అనధికార వార్తలు సూచిస్తున్నాయి. 


ఠాక్రే వార్నింగ్‌

పంజాబ్‌, చండీగఢ్‌, మహారాష్ట్రల్లో సంపూర్ణంగా కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక సంఖ్యాకులకు సోకి- కేసులు 100కు చేరువగా ఉండడంతో సోమవారం అర్థరాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. రాష్ట్ర సరిహద్దులను మూసేశారు. పంజాబ్‌లో ప్రజలు లాక్‌డౌన్‌ను ధిక్కరించి, ఆంక్షలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం కర్ఫ్యూను ప్రకటించింది. 


ప్రభుత్వ చర్యలు భేష్‌: సుప్రీం

సుప్రీంకోర్టు కూడా  కేవలం అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణకు చేపట్టింది. ఒకటో నెంబరు కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ కూర్చు ని 3 కేసుల్లో వాదనలను ఆలకించింది. ప్రభుత్వ చర్యలపై సీజే బోబ్డే, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావుల మరో బెంచ్‌ కితాబిచ్చింది.  


నేటి నుంచి ‘శంషాబాద్‌’ బంద్‌

దేశీయ విమానాలనూ బంద్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మంగళవారం అర్థరాత్రి 12 గంటల నుంచి దేశంలో నగరాల మధ్య సర్వీసులన్నీ నిలిపేయాల్సిందిగా అన్ని ప్రైవేటు విమానయాన సంస్థలకూ కేంద్రం నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. అయితే ఇది కార్గో సర్వీసులకు వర్తించదు.  శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కూడా దేశీయ సర్వీసులు ఆపేస్తున్నారు. ఆదివారం రాత్రి షికాగోకు చివరి అంతర్జాతీయ సర్వీసు (ఏఐ 127) బయల్దేరి వెళ్లాక మరిక అంతర్జాతీయ విమానాలు గాల్లోకి లేవలేదు. సోమవారం ఒక్కరోజే 122 సర్వీసులు రద్దయినట్లు అధికారులు చెప్పారు. 31వరకూ ఈ పరిస్థితి అమల్లో ఉంటుందని తెలిపారు.

Read more