అందరి ఆకాంక్షలు నెరవేరే సమయమిది : మోదీ
ABN , First Publish Date - 2020-11-03T20:25:20+05:30 IST
ప్రజలందరి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పాట్నా : ప్రజలందరి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిహార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. గత దశాబ్దంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. ఇప్పుడిక తమ కూటమి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని చెప్పారు.
ఆరారియా జిల్లాలోని ఫోర్బ్స్ గంజ్‌లో ఎన్నికల ప్రచార సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, గడచిన దశాబ్దంలో ప్రతి ఇంటికి విద్యుత్తు, వంట గ్యాస్ కనెక్షన్ సదుపాయం అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పుడు 2021 నుంచి 2030 మధ్య కాలం బిహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన సమయమని తెలిపారు.
బిహార్ శాసన సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ మంగళవారం జరుగుతోంది. మోదీ మూడో దశ పోలింగ్ జరిగే ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండో దశ పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు గతంతో పోల్చితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని మోదీ అన్నారు. ప్రపంచానికి మన దేశం మాత్రమే కాకుండా బిహార్ ఓ సందేశాన్ని ఇస్తోందన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా బిహార్ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యం శక్తి అని, ప్రతి బిహార్ వ్యక్తి దీని పట్ల అంకితభావం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. భారతీయుల మనసుల్లో ప్రజాస్వామ్యం ఎంత గాఢంగా ఉందో ప్రపంచవ్యాప్తంగా మేధావులు లెక్కలు కడతారన్నారు.
ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల కూటమిపై విరుచుకుపడుతూ, కాంగ్రెస్‌కు లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం 100 మంది ఎంపీలు లేరన్నారు. ప్రజలు ఆ పార్టీని అవకాశం వచ్చినపుడల్లా శిక్షిస్తారన్నారు.
బిహార్ శాసన సభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఈ నెల 7న జరుగుతుంది, ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరుగుతుంది.