బ్రిటీష్ రాణి కంటే సంపన్నురాలు అక్షత మూర్తి
ABN , First Publish Date - 2020-12-06T07:37:20+05:30 IST
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 కంటే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షత సంపన్నురాలా..? అవునంటోంది బ్రిటిష్ పత్రిక ది గార్డియన్.

ఆస్తి వివరాల గోప్యత విషయంలో
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తనయపై ‘ది గార్డియన్’ విమర్శలు
లండన్, డిసెంబరు 5: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 కంటే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షత సంపన్నురాలా..? అవునంటోంది బ్రిటిష్ పత్రిక ది గార్డియన్. ఈ మేరకు తాము నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన కథనాన్ని తాజాగా ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. అక్షత ఆస్తి రూ. 4200కోట్ల పైమాటే. మరోవైపు రాణి ఎలిజబెత్ ఆస్తి విలువ రూ. 3400 కోట్లుగా ఉంది. అక్షత ఆస్తిలో అధిక శాతం ఇన్ఫోసి్‌సలో వాటాలే. అందులో ఆమె వాటా 0.91శాతంగా ఉంది. అవి కాక, భారత్‌లో అమెజాన్‌తో రూ. 8926 కోట్ల విలువైన భాగస్వామ్యం ఉంది.
యూకేలోని మరో ఆరు సంస్థల్లోనూ ఆమెకు పెట్టుబడులున్నాయి. అక్షత భర్త రిషి సునక్ బ్రిటన్ ప్రభుత్వ కోశాధికారిగా ఉన్నారు. ఇక్కడి నిబంధనల ప్రకారం.. మంత్రులందరూ తమ ఆస్తుల వివరాలు ప్రకటించాల్సిందే. తన భార్య పేరిట కేవలం కాటమారన్ వెంచర్స్ అనే సంస్థ మాత్రమే ఉందని రిషి తన ఆస్తి వివరాల్లో వెల్లడించారని గార్డియన్ పేర్కొంది. పత్రిక కథనాన్ని అనుసరించి సునక్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఇన్ఫోసి్‌సలో నారాయణ మూర్తి కుటుంబానికి ఉన్న వాటాల విలువ దాదాపు 16.8వేల కోట్లు కావడం గమనార్హం.