లాక్‌డౌన్‌తో పెరిగిన గాలి నాణ్యత

ABN , First Publish Date - 2020-05-13T08:22:55+05:30 IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో విధించిన లాక్‌డౌన్లు, వాతావరణానికి చాలా మేలు చేశాయంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని...

లాక్‌డౌన్‌తో పెరిగిన గాలి నాణ్యత

  • ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన నైట్రోజన్‌ డయాక్సైడ్‌
  • పరిశోధకుల వెల్లడి

బెర్లిన్‌, మే 12: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో విధించిన లాక్‌డౌన్లు, వాతావరణానికి చాలా మేలు చేశాయంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొంటున్నారు. రాయల్‌ బెల్జియుయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ ఏరోనమీకి చెందిన పరిశోధకులు ఈ మేరకు జియోఫిజికల్‌ రిసెర్చ్‌ లెటర్స్‌ పత్రికలో తమ పరిశోధన వివరాలను ప్రచురించారు. ఆ నివేదిక ప్రకారం.. ఉత్తర చైనా, పశ్చిమ యూరప్‌, అమెరికా భూభాగాలపై నైట్రోజన్‌ డయాక్సైడ్‌ స్థాయులు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏకంగా 60శాతానికి పైగా తగ్గాయి. 1990ల్లో ఉపగ్రహాల ద్వారా వాతావరణ కాలుష్య పరిశీలన మొదలైన తర్వాత, ఈ స్థాయులో కాలుష్యం తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి ఇది తాత్కాలికమే అయినప్పటికీ.. భవిష్యత్తులో ఉద్గారాల తగ్గుదల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక అవగాహన కొరకు ఇది ఉపకరించనుంది. అంతటా ఉద్గారాలు తగ్గినప్పటికీ.. చైనాలో మాత్రం ఉపరితల ఓజోన్‌ స్థాయులు పెరిగాయి.


వాతావరణ ఓజోన్‌తో పోలిస్తే.. ఉపరితల ఓజోన్‌ ప్రమాదకరం అని పరిశోధకులు పేర్కొన్నారు. ఉపగ్రహాల సాయంతో చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇరాన్‌, అమెరికాల పరిధిలో గాలి నాణ్యతను అంచనా వేశామని వెల్లడించారు. అన్ని దేశాల్లో నైట్రోజన్‌ డయాక్సైడ్‌ తగ్గినప్పటికీ.. ఇరాన్‌లో మాత్రం పాత స్థాయిలోనే ఉండటం గమనార్హం. ఆ దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలుచేయడంలో ప్రభుత్వ వైఫల్యమే అందుకు కారణం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-05-13T08:22:55+05:30 IST