ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల షెడ్యూల్ రెడీ..!
ABN , First Publish Date - 2020-05-13T20:45:31+05:30 IST
భారత్ లాక్‌డౌన్ 4.0కు సిద్ధమవుతున్న నేపథ్యంలో దశలవారిగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా వ్యూహరచన..

న్యూఢిల్లీ: భారత్ లాక్‌డౌన్ 4.0కు సిద్ధమవుతున్న నేపథ్యంలో దశలవారిగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా వ్యూహరచన చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో నిలిచిపోయిన ప్రయాణికులను తమ ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక డొమెస్టిక్ విమానాలను ఈనెల 19 నుంచి జూన్ 2 వరకూ ఎయిర్ ఇండియా నడుపనున్నట్టు తెలుస్తోంది. వివిధ నగరాల మధ్య ఈ ప్రత్యేక విమానాలు నడుస్తాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, జైపూర్‌ల నుంచి ఈ సర్వీసులు ఉంటాయని అధికార వర్గాల సమాచారం.
అయితే డొమెస్టిక్ ఆపరేషన్ల ప్రారంభానికి ఇది సూచనా అనేది ఎయిర్ ఇండియా ఇంకా వెల్లడించలేదు. వివిధ రాష్ట్రాల్లో నిలిచిపోయిన ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలించే చర్యల్లో భాగంగానే ప్రత్యేక సర్వీసులు ఉంటాయని ఏఐ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సూత్ర్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. అయితే పౌర విమానయాన శాఖ నుంచి తుది అంగీకారం రావాల్సి ఉంది. త్వరలోనే ఈ దిశగా నోటిఫికేషన్ విడుదలవుతుందని చెబుతున్నారు. ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.