జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల బాధ్యులు విధులు నిర్వర్తించడం లేదు : మండిపడ్డ మొయిలీ

ABN , First Publish Date - 2020-07-15T21:06:40+05:30 IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల బాధ్యులు ఏమాత్రం సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం

జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల బాధ్యులు విధులు నిర్వర్తించడం లేదు : మండిపడ్డ మొయిలీ

బెంగళూరు : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల బాధ్యులు ఏమాత్రం సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెంటనే జోక్యం చేసుకొని జాతీయ కార్యవర్గాన్ని వెంటనే మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ పరిణామాలపై ప్రశ్నించగా.... ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కే మద్దతుగా నిలిచారు. సచిన్ పైలెట్ మరికొన్ని రోజులు వేచిచూస్తే బాగుంటుందని మొయిలీ అభిప్రాయపడ్డారు.


ప్రస్తుత రోజుల్లో మాత్రం కాంగ్రెస్‌లో యువ నేతలనే ప్రోత్సహిస్తున్నారని, అంతేకానీ... సీనియర్లను పక్కన పెట్టడం కాదని చురకలంటించారు. ఈ కాలం యువనేతల్లో ఏమాత్రం ఓపిక ఉండటం లేదని పరోక్షంగా పైలెట్‌కు ఈయన చురకలంటించారు. సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి పదవికి పూర్తి అర్హుడని, అయితే మరికొన్ని రోజులు ఓపిక పడితే బాగుంటుందని పేర్కొన్నారు. కేవలం 42 ఏళ్ల వయస్సులోనే ఎంపీగా ఎన్నికయ్యారని, కేంద్ర మంత్రి అయ్యారని, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లాంటి కీలక పదవులు కూడా నిర్వహిస్తున్నారని అన్నారు.


స్థానిక నేతల నుంచి వస్తున్న సవాళ్లు, డిమాండ్లను అర్థం చేసుకోవడంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జీలు విఫలం చెందారని ఆయన మండిపడ్డారు. వారు అంతలా యాక్టివ్‌గా ఉన్నట్లయితే రాజస్థాన్ వ్యవహారం సమసిపోయి ఉండేదని, చాలా సార్లు వారు స్థానిక ఇబ్బందులను అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకురారని మొయిలీ ఆరోపించారు. 

Updated Date - 2020-07-15T21:06:40+05:30 IST