అన్నాడీఎంకే ప్రచార సభలకు నేడు శ్రీకారం
ABN , First Publish Date - 2020-12-27T16:47:02+05:30 IST
అన్నాడీఎంకే ఆధ్వర్యంలో స్థానిక రాయపేట వైఎంసీఏ మైదానంలో..

చెన్నై : అన్నాడీఎంకే ఆధ్వర్యంలో స్థానిక రాయపేట వైఎంసీఏ మైదానంలో భారీ ఏర్పాట్ల నడుమ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ ఆదివారం ప్రారంభంకానుంది. ఈ సభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ప్రసంగించనున్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడిని పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రకటించారు. అలాగే, మండలాల వారీగా ఎన్నికల సమస్వయకర్తలను నియమించడంతో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో తయారీకి మాజీ మంత్రి సి.పొన్నయ్యన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటోంది.
ఇటీవల సీఎం పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడిలో ఉన్న పెరుమాళ్ ఆలయాన్ని దర్శించుకొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఈనెల 27న ఆదివారం నగరంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో ఈపీఎస్, ఓపీఎస్‌లు ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. ఇందుకోసం స్థానిక రాయపేటలోని వైఎంసీఏ మైదానంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సభలో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు మొత్తం 20 వేల మందికి ఆహ్వానలేఖలు పంపారు. అదే సమయంలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు హాజరుకానున్నారు.