2 రోజుల్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు..స్పీకరుకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-09-21T11:58:22+05:30 IST

రెండు రోజుల్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్‌కు కరోనా సోకింది...

2 రోజుల్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు..స్పీకరుకు కరోనా పాజిటివ్

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): రెండు రోజుల్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్‌కు కరోనా సోకింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకరుకు యాంటీజెన్ పరీక్ష చేయగా కొవిడ్-19 పాజిటివ్ అని వెల్లడైంది. ఒకరోజు ముందు జరిపిన పరీక్షల్లో ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత ఇందిరా హృదయేష్ కు కూడా కరోనా సోకింది.‘‘నాకు వైద్యులు జరిపిన యాంటీజెన్ పరీక్షలో కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. నాకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో వైద్యులు హోం ఐసోలేషన్ లో ఉండమని సలహా ఇచ్చారు’’ అని స్పీకర్ అగర్వాల్ చెప్పారు. 


కరోనా సోకినా చికిత్సకు డెహ్రాడూన్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో కనీసం బెడ్ కూడా ఇవ్వలేదని, కరోనా కట్టడిలో ఉత్తరాఖండ్ సర్కారు విఫలమైందని కరోనా బాధితురాలు,ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకురాలు హృదయేష్ ఆరోపించారు. తన తల్లి నాలుగు గంటలపాటు వేచి ఉన్నా డెహ్రాడూన్ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ ఇవ్వలేదని సుమిత్ హృదయేష్ విమర్శించారు.స్పీకరు , మంత్రులు ఫోన్ చేసినా డెహ్రాడూన్ ఆసుపత్రిలో బెడ్ ఇవ్వకపోవడంతో తన తల్లిని గురుగ్రామ్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని సుమిత్ వివరించారు.


ఈ నెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున వీలైతే తాను ఆన్ లైన్ లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తానని, లేకుంటే డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు నడుపుతారని స్పీకర్ అగర్వాల్ చెప్పారు. 

Updated Date - 2020-09-21T11:58:22+05:30 IST