డాక్ట‌రైన మ‌హిళా ఎస్ఐ... ఫోన్‌లో సూచ‌న‌లు వింటూ డెలివ‌రీ!

ABN , First Publish Date - 2020-08-20T11:51:04+05:30 IST

త్రీ ఈడియట్స్‌ సినిమాలో ఒక నటుడు వాక్యూమ్ ప్రెజర్ ద్వారా గ‌ర్భిణికి డెలివ‌రీచేసే సన్నివేశం ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను హ‌త్తుకుంటుంది. భారీ వర్షం కురుస్తుండ‌గా, మ‌రోమార్గంలేని స‌మ‌యంలో...

డాక్ట‌రైన మ‌హిళా ఎస్ఐ... ఫోన్‌లో సూచ‌న‌లు వింటూ డెలివ‌రీ!

ఝాన్సీ: త్రీ ఈడియట్స్‌ సినిమాలో ఒక నటుడు వాక్యూమ్ ప్రెజర్ ద్వారా గ‌ర్భిణికి డెలివ‌రీచేసే సన్నివేశం ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను హ‌త్తుకుంటుంది. భారీ వర్షం కురుస్తుండ‌గా, మ‌రోమార్గంలేని స‌మ‌యంలో ఆ న‌టుడు త‌న స్నేహితుల సాయంతో ఆ గ‌ర్భిణికి సుర‌క్షితంగా పురుడుపోస్తాడు. ఇటువంటి ఘ‌ట‌నే యూపీలోని ఝాన్సీ రైల్వేస్టేష‌న్‌లో చోటుచేసుకుంది. గోవా ఎక్స్‌ప్రెస్‌లో భర్తతో కలిసి ప్రయాణిస్తున్న ఒక గ‌ర్భిణికి పురిటి నొప్పులు వ‌చ్చాయి. దీంతో భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఝాన్సీ రైల్వే స్టేష‌న్‌లో దిగిపోయారు. ఆ రాత్రి సమయంలో డాక్టర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో మ‌హిళా ఎస్ఐ రాజ‌కుమారి గుర్జర్ ఆ గ‌ర్భిణికి డెలివ‌రీ చేసేందుకు ముందుకు వ‌చ్చారు. త‌న స్నేహితురాలైన ఒక వైద్యురాలిని ఫోన్లో సంప్రదించారు. ఆమె ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఆ మ‌హిళా ఎస్ఐ ప్లాట్‌ఫారమ్‌పైన‌నే ఆ గ‌ర్భి‌ణికి సురక్షితమైన డెలివరీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రావత్‌పురా జిల్లా బింద్‌లో నివసిస్తున్న బాద్‌షా, గోవా ఎక్స్‌ప్రెస్‌లో తన భార్య పూజ (19) తో కలిసి దౌండ్ నుంచి గ్వాలియర్ వెళ్తున్నారు. ఇంత‌లో పూజకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వారు ఝాన్సీ రైల్వే స్టేష‌న్‌లో దిగిపోయారు. పరిస్థితిని గ‌మ‌నించిన మ‌హిళా ఎస్‌ఐ రాజ‌కుమారి గుర్జర్‌ తన స్నేహితురాలైన‌ డాక్టర్ డాక్టర్ నీలు కసోటియాకు ఫోను చేశారు. ఆ వైద్యురాలు ఫోనులో సూచ‌న‌లు చేస్తుండ‌గా, ఎస్ఐ రాజ‌కుమారి ఆ గ‌ర్భిణికి సుర‌క్షితంగా డెలివ‌రీ చేశారు. వెంట‌నే అంబులెన్స్‌ను పి‌లిపించి త‌ల్లీబిడ్డ‌లను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ ఆసుప‌త్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న‌వారంతా ఆ మ‌హిళా ఎస్ఐని అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Read more