బీజేపీ‌లో చేరిన వెంటనే.. జ్యోతిరాదిత్య సింధియాపై ఫోర్జరీ కేసు క్లోజ్!

ABN , First Publish Date - 2020-03-24T20:56:49+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో

బీజేపీ‌లో చేరిన వెంటనే.. జ్యోతిరాదిత్య సింధియాపై ఫోర్జరీ కేసు క్లోజ్!

భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసును మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) మూసివేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 2009లో గ్వాలియర్‌లోని భూమిని అమ్మినట్టు అప్పట్లో వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నెల 10న సింధియా కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం బీజేపీలో చేరి మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడిన తర్వాత ఆయన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. 

ఈ నెల 12న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2009లో సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసు విషయంలో నిజనిర్ధారణ చేయాలని ఈవోడబ్ల్యూ నిర్ణయించింది. ఈ నెల 12న ఫిర్యాదుదారు సురేంద్ర శ్రీవాస్తవ తమను సంప్రదించాడని, సింధియాలపై నమోదైన కేసు విషయం మరోమారు పరిశీలించాలని కోరారని ఈవోడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఆయన ఫిర్యాదును తాము గ్వాలియర్ కార్యాలయానికి పంపామని, వారు తిరిగి విచారణ జరిపి కేసును క్లోజ్ చేశారని పేర్కొన్నారు.


సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసును శుక్రవారమే మూసివేసినట్టు తెలిసింది. అదే రోజున కమల్‌నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. కాగా, సోమవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  

Read more