బీజేపీ కూటమి నుంచి బయటికి రావాలంటూ దుష్యంత్ పై పెరుగుతున్న ఒత్తిడి

ABN , First Publish Date - 2020-09-18T15:44:05+05:30 IST

వ్యవసాయ రంగ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి వర్గం నుంచి అకాళీదళ్ బయటికి వచ్చేసింది.

బీజేపీ కూటమి నుంచి బయటికి రావాలంటూ దుష్యంత్ పై పెరుగుతున్న ఒత్తిడి

హర్యానా : వ్యవసాయ రంగ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి వర్గం నుంచి అకాళీదళ్ బయటికి వచ్చేసింది. ఆ పార్టీకి చెందిన ఏకైక మంత్రి హర్ సిమ్రత్ కౌర్ గురువారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ వ్యవహారం పక్క రాష్ట్రమైన హర్యానాపై పడింది. బీజేపీ కూటమి నుంచి బయటికి రావాలంటూ హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనశక్తి పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలాపై ఒత్తిడి పెరుగుతోంది.


‘‘దుష్యంత్ జీ... మీరు కూడా హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ను అనుసరించండి. కనీసంలో కనీసం డిప్యూటీ సీఎం పదవికైనా రాజీనామా చేయండి. రైతుల కంటే మీరు మీ పదవికే ఎక్కువ అతుక్కుపోయారు’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఘాటుగా విమర్శించారు.


మరోవైపు అకాళీదళ్‌కు, జేజేపీకి రైతుల ఓటు బ్యాంకు ఎక్కువ మోతాదులో వుంది. వ్యక్తిగతంగానూ ఈ రెండు పార్టీలకూ కుటుంబ సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అకాళీదళ్ కూడా బీజేపీ కూటమి నుంచి బయటికి వచ్చేయాలంటూ దుష్యంత్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లును దుష్యంత్ మొదట్లో వ్యతిరేకించారు.


పార్లమెంట్ లో మాత్రం దుష్యంత్  వ్యవసాయ బిల్లును వ్యతిరేకించలేదు. అయితే పార్టీలో మాత్రం దుష్యంత్ పై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. పార్టీకి చెందిన ఎమ్మెల్యే దేవేందర్ బబ్లీ దుష్యంత్ పై బాహాటంగానే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా దుష్యంత్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి దుష్యంత్ రాజీనామా చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠత నెలకొంది. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ పంజాబ్‌లోని కురుక్షేత్ర ప్రాంతంలో రైతులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో హర్యానాలో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.


లాఠీచార్జ్ పై విచారణకు ఆదేశించామని దుష్యంత్ స్వయంగా ప్రకటించారు. రైతులకు క్షమాపణలు కూడా తెలిపారు. అయినా సరే... అక్కడి వాతావరణం అంతే గంభీరంగా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ముందు నుంచి కూడా జేజేపీకి రైతులు అండగా నిలబడుతున్నారు. ఈ ఘటన మరిచిపోక ముందే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికి వచ్చేయాలంటూ అకాలీదళ్ సంచల నిర్ణయం తీసుకుంది.


దీంతో దుష్యంత్ చౌతాలా ఇరకాటంలో పడిపోయినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి దుష్యంత్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, అకాలీదళ్ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా బీజేపీ కూటమి నుంచి బయటికి వస్తారా? లేరా? అన్న ఆసక్తి నెలకొంది. 

Updated Date - 2020-09-18T15:44:05+05:30 IST