చైనా క్షమాపణ చెప్పాల్సిందే : ఆఫ్ఘనిస్థాన్

ABN , First Publish Date - 2020-12-25T18:32:01+05:30 IST

దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను ఆప్ఘనిస్థాన్

చైనా క్షమాపణ చెప్పాల్సిందే : ఆఫ్ఘనిస్థాన్

కాబూల్ : దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనా క్షమాపణ  చెప్పాలని ఆప్ఘనిస్థాన్ డిమాండ్ చేసింది. ఆప్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడుపుతున్న 10 మంది చైనీయులు ఇటీవల పట్టుబడటంతో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి, తమ దేశంలో గూఢచర్యం, ఉగ్రవాదాలకు పాల్పడుతున్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 


ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్) డిసెంబరు 10 నుంచి సోదాలు నిర్వహిస్తోంది. ఇటీవల 10 మంది చైనీయులను అరెస్ట్ చేసింది. వీరు కాబూల్‌లో గూఢచర్యం చేస్తూ, టెర్రర్ సెల్‌ను నడుపుతున్నట్లు కేసు నమోదు చేసింది. ఈ చైనీయులకు చైనా గూఢచార సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. 


ఈ గుట్టు బయటపడటంతో చైనా ఇబ్బంది పడుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ దౌత్యవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసును బయటికి వెల్లడికాకుండా చూడాలని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో చైనా మంతనాలు జరుపుతోంది. 


ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ జరుగుతున్నప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో పలుకుబడి కోసం చైనా ప్రయత్నిస్తోంది. గూఢచర్యం చేస్తూ, ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు నెరపుతోంది. ఇటీవల పట్టుబడిన 10 మంది చైనీయుల్లో ఇద్దరికి హక్కానీ నెట్‌వర్క్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. 


ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ కేసును దేశ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్‌కు అప్పగించారు. సలేహ్ ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా గతంలో పని చేశారు. ఈ కేసులో ఉన్న సున్నితత్వం దృష్ట్యా చైనాతో సంప్రదింపులు జరపాలని తెలిపారు. దీంతో సలేహ్ కాబూల్‌లోని చైనీస్ దౌత్యవేత్త వాంగ్ యుతో సమావేశమయ్యారు. 10 మంది చైనీయులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ చైనీస్ గూఢచారులను క్షమించే విషయాన్ని తాము పరిశీలిస్తామని, అయితే అంతకుముందు చైనా తమకు క్షమాపణ చెప్పాలని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు, ఆఫ్ఘనిస్థాన్‌కు నమ్మక ద్రోహం చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. లేనిపక్షంలో వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 
Updated Date - 2020-12-25T18:32:01+05:30 IST