ముందూ వెనక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం లాక్‌డౌన్ : అధీర్ రంజన్
ABN , First Publish Date - 2020-05-29T18:55:36+05:30 IST
కేంద్రంపై లోకసభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో

న్యూఢిల్లీ : కేంద్రంపై లోకసభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో విధించిన లాక్‌డౌన్ ముందువెనుక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే కేంద్రం లాక్‌డౌన్ విధించిందని ఆయన విమర్శించారు. దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30 న బయటపడిందని, కేంద్రం మాత్రం ఫిబ్రవరి 26 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని, చైనాకు ఔషధాలను ఎగుమతి చేయడంలో బిజీగా ఉండిపోయిందని మండిపడ్డారు.
గాయని కనికా కపూర్‌కు కరోనా సోకడం, అది కాస్తా బీజేపీ నేతకు పాకడంతో ప్రభుత్వం మేల్కొందని, దేశంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అప్పుడు గమనించి, లాక్‌డౌన్ విధించిందని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ ఫిబ్రవరిలోనే కేంద్రం ముందస్తు చర్యలు పకడ్బందీగా చేసి ఉంటే... ఇప్పుడు దేశ పరిస్థితులు మరోలా ఉండేవని అన్నారు. ఎప్పటి నుంచో తాము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నామని, అయినా అధికారంలో ఉన్న వారు తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టారని ఆయన ఆరోపించారు.
‘‘తాము లాక్‌డౌన్‌కు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదు. అయితే ప్రభుత్వం జాప్యంతో తీసుకున్న నిర్ణయంపైనే తమ అభ్యంతరం. ముందూవెనుక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం. ఎలాంటి ముందస్తు వ్యూహం లేకుండానే లాక్‌డౌన్ విధించారు’’ అని అధీర్ మండిపడ్డారు.