సుశాంత్ మృతి కేసు: పోలీసులను ఆశ్రయించిన బాలీవుడ్ హీరో
ABN , First Publish Date - 2020-08-12T04:09:35+05:30 IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులోకి తనను అనవసరంగా లాగుతున్నారంటూ ..

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులోకి తనను లాగుతున్నారంటూ యువనటుడు సూరజ్ పంచోలి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఇవాళ వెర్సోవా పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టాడు. ఇటీవల పలు సోషల్ మీడియా వేదికలపై తనకు, సుశాంత్ మృతికి ముడిపెడుతూ రకరకాల పోస్టులు పెడుతున్నారని సూరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా సుశాంత్ మృతికి, తన కుమారుడికి ముడిపెడుతూ వస్తున్న ఆరోపణలను ఇప్పటికే సూరజ్ తల్లి జరీనా వహాబ్ కూడా ఖండించారు. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆయనది ఆత్మహత్య కాదనీ.. ఎవరో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ అనుమానాలు వ్యక్తం కావడంతో ముంబై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ కుటుంబ సభ్యులు, పనివాళ్లు, బాలీవుడ్ ప్రముఖులు సహా ఇప్పటికే దాదాపు 56 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. మరోవైపు సుశాంత్ మృతిపై సీబీఐ, ఈడీ సంస్థలు సైతం కేసులు నమోదు చేశాయి.