ఆ ముగ్గురు ప్రముఖులకు కరోనా..

ABN , First Publish Date - 2020-09-06T22:36:19+05:30 IST

మూడు రంగాలకు చెందిన ప్రముఖలు ఆదివారంనాడు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ నటుడు..

ఆ ముగ్గురు ప్రముఖులకు కరోనా..

న్యూఢిల్లీ: మూడు రంగాలకు చెందిన ప్రముఖులు ఆదివారంనాడు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, రెజ్లర్ దీపక్ పునియా, పార్లమెంటు సభ్యుడు దీపేందర్ హుడాకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యపరీక్షల్లో తేలింది. 


హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఓ ట్వీట్‌లో తెలిపారు. వైద్యులు మరిన్ని పరీక్షలు చేస్తున్నారని, ప్రజలందరి అశీస్సులతో త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నానని చెప్పారు.


కాగా, రెజ్లర్ పునియాకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వైద్యలు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆయనకు సూచించినట్టు తెలిపింది. 2019 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలో దీపక్ పునియా సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.


మరోవైపు, తనకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు. 'కరోనా పాజటివ్ వచ్చిన విషయం మీ అందరికీ చెప్పడం నా బాధ్యత. ఒంట్లో ఎలాంటి ఇబ్బంది కానీ, ఆ లక్షణాలు కానీ లేవు. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసొలేషన్‌లోనే ఉన్నాను. మీ అందరు ఇస్తున్న మనోధైర్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య వివరాలు మీతో పంచుకుంటాను. వైరస్‌పై మానవత్వమే గెలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రేమతో, అర్జున్' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Updated Date - 2020-09-06T22:36:19+05:30 IST