వారంలో యాక్షన్‌ ప్లాన్‌!

ABN , First Publish Date - 2020-09-18T07:25:07+05:30 IST

నేరచరిత్ర కలిగిన ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులను సత్వరమే విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది...

వారంలో యాక్షన్‌ ప్లాన్‌!

నేతలపై క్రిమినల్‌ కేసుల్లో సత్వర విచారణకు కార్యాచరణ

అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు నిర్దేశం


 • కేసుల విచారణ పర్యవేక్షణకు హైకోర్టుల్లో ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు
 • ముందు పెండింగ్‌ కేసుల జాబితా తయారు 
 • స్టే మంజూరైన కేసులు వేరే బెంచ్‌లకు
 • స్టే తప్పనిసరైతే రోజువారీ విచారణ
 • వాయిదాల్లేకుండా 2 నెలల్లో తేల్చేయాలి
 • కొవిడ్‌-19 పరిస్థితులు అడ్డంకి కారాదు
 • వీడియో కాన్ఫరెన్సులో విచారణ జరపొచ్చు
 • హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లకు మార్గదర్శకాలు
 • రాజకీయాల్లో పలుకుబడిగల
 • నేరచరితులను ఏరివేయడమే మా ఉద్దేశం
 • ప్రజాస్వామిక సంస్థల స్వచ్ఛతను కాపాడతాం
 • జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్యలు

  ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని పెండింగ్‌ క్రిమినల్‌ కేసుల జాబితాను తయారు చేయాలి. స్టే మంజూరైన కేసులను గుర్తించి, తగిన బెంచ్‌లకు నివేదిం చాలి. కేసులపై స్టే కొనసాగిం చాలా? లేదా? అన్నది కోర్టు ముందుగా నిర్ణయించాలి. స్టే తప్పనిసరైతే అలాంటి కేసులపై రోజువారీ విచారణ జరిపి, ఎటు వంటి అనవసర వాయిదాలు లేకుండా 2 నెలల్లో తేల్చేయాలి.

  • - జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం


  న్యూఢిల్లీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నేరచరిత్ర కలిగిన ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులను సత్వరమే విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటిని హేతుబద్ధంగా ఏర్పాటు చేసేందుకు వారం రోజుల్లోగా యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి సమర్పించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళిక రూపొందించేటప్పుడు ఇప్పటికే వేగంగా విచారణ జరుగుతున్న కేసులను మరో కోర్టుకు బదిలీ చేయడం అవసరమో కాదో హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతంగా జరిగేలా ఆదేశాలివ్వాలని ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బుధవారం ఇచ్చిన ఈ ఆదేశాలను గురువారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.


  ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రధాన న్యాయమూర్తులు తమ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఏడాదిలోపు ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ, జిల్లాకో ప్రత్యేక కోర్టు తదితర సూచనలతో అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా దాఖలు చేసిన అఫిడవిట్‌పై హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు తమ వ్యాఖ్యలను పంపాలని.. అవసరమైతే తమ సూచనలను కూడా జోడించాలని నిర్దేశించింది. సిటింగ్‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని పెండింగ్‌ క్రిమినల్‌ కేసుల జాబితాను తయారు చేయాలని.. ప్రధానంగా స్టే మంజూరైన కేసులను గుర్తించి తగిన బెంచ్‌లకు నివేదించాలని కోరింది. ‘కేసులపై స్టే కొనసాగించాలా లేదా అన్నది కోర్టు ముందుగా నిర్ణయించాలి. స్టే తప్పనిసరైతే అలాంటి కేసులపై రోజువారీ విచారణ జరిపి ఎటువంటి అనవసర వాయిదాలు లేకుండా రెండు నెలల్లో తేల్చేయాలి. ఈ ఆదేశాలను పాటించడానికి కొవిడ్‌-19 పరిస్థితులు ఏ మాత్రం అడ్డంకి కారాదు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపే సౌలభ్యం ఉంది’ అని గుర్తుచేసింది. శిక్షపడిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధించాలంటూ అమికస్‌ క్యూరీ చేసిన  సూచనలపై సరైన సమయంలో ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.


  హైకోర్టులకు మార్గదర్శకాలివీ..

  హేతుబద్ధమైన రీతిలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విషయమై కార్యాచరణ రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అవి ఇవీ..

  1. ప్రతి జిల్లాలో మొత్తం పెండింగ్‌ కేసుల సంఖ్య

  2. ఎన్ని ప్రత్యేకకోర్టుల ఏర్పాటు అవసరం?

  3. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోర్టులు

  4. అంశాల వారీగా వివిధ కేసులు..

  5. ప్రతి న్యాయమూర్తికీ కేటాయించిన కేసుల సంఖ్య

  6. ప్రత్యేక కోర్టు జడ్జిగా నియమితులయ్యే న్యాయమూర్తి పదవీకాలం ఎంత ఉంది?

  7. కేసులు తేల్చేందుకు పట్టే సమయం

  8. ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుల మధ్య దూరం

  9. మౌలిక సదుపాయాల లభ్యత


  కేసు పూర్వాపరాలు..

  ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతంగా జరగాలని సుప్రీంకోర్టు గతంలో పలు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ముందుకు కదలకపోవడంతో నిర్దిష్ట సమయంలోగా సత్వర విచారణ జరపాలని ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ 2016లో పిటిషన్‌ దాఖలు చేశారు. అదే ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో కోర్టుకు సాయపడేందుకు సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియాను అమికస్‌ క్యూరీగా నియమించింది. దేశంలో పలువురు ప్రజాప్రతినిధులపై 4,442 పెండింగ్‌ కేసులు ఉన్నాయని.. అయితే అవినీతి నిరోధక చట్టం వంటి ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల జాబితా ఇంకా రావలసి ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. దీంతో ఈ వివరాలను కూడా తమకు రెండ్రోజుల్లో సమర్పించాలని ఈ నెల 10వ తేదీన జస్టిస్‌ ఎన్వీ రమణ వివిధ హైకోర్టులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులపై సత్వర విచారణ జరగాలన్న అభిప్రాయాన్ని సమర్థించారు. హైకోర్టులు స్టే విధించినా అన్ని పెండింగ్‌ కేసులను నెలలోపు పరిష్కరించాలని సూచించారు. సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర సంస్థల ముందు పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులకు సంబంధించి వాస్తవ స్థితిగతుల నివేదికను సమర్పించేందుకు ఆయన అంగీకరించారు. ఈ కేసుల్లో ఏ అధికారి అయినా అనవసర జాప్యానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.


  నేతల నేపథ్యం ప్రజలకు తెలియాలి

  ఎన్నికైన ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులను వేగంగా విచారించడం వెనుక ప్రధాన ఉద్దేశం.. దేశ రాజకీయాల్లో రోజురోజుకూ పెరుగుతున్న నేరచరితులను ఏరివేయడమే కాదని.. విచారణను సమర్థంగా అడ్డుకునేందుకు ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని పలుకుబడిని ప్రదర్శించకుండా చూడడం కూడానని జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రజాప్రతినిధులు ఓటర్ల విశ్వాసానికి ప్రతిరూపాలు. ఎన్నుకుంటున్న వారి నేపథ్యం తెలుసుకోవడం ప్రజలకు అవసరం. ప్రస్తుత విచారణ ప్రధాన లక్ష్యం ప్రజాస్వామికంగా ఎన్నికైన సంస్థల స్వచ్ఛతను కాపాడడమే’ అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజాప్రతినిధులపై పెండింగ్‌ కేసుల సత్వర విచారణలో పెద్దగా మార్పు లేదని వ్యాఖ్యానించింది. ఇప్పుడు వివిధ హైకోర్టుల నుంచి వచ్చిన సమాచారం, అమికస్‌ క్యూరీ, సొలిసిటర్‌ జనరల్‌, ఇతర న్యాయవాదుల సూచనలతో ఈ కేసును తేల్చేందుకు సమాయత్తమవుతున్నామని పేర్కొంది. న్యాయవాది స్నేహ కలితా సాయంతో హన్సారియా తాజాగా దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ ద్వారా పెండింగ్‌ కేసుల వివరాలు తెలిశాయని తెలిపింది. ‘అవినీతి నిరోధక చట్టం(1988) ప్రకారం 175 కేసులు, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం 14 కేసులు ఉన్నాయి. అమికస్‌ క్యూరీ ఈ నెల 8న దాఖలు చేసిన నివేదికలో పేర్కొన్న 4,442 క్రిమినల్‌ కేసులకు ఇవి అదనం’ అని వెల్లడించింది.


  ‘ప్రజాప్రతినిధులు ఓటర్ల విశ్వాసానికి నమ్మకానికి ప్రతిరూపాలు. అందువల్ల తాము ఎన్నుకుంటున్న వారి నేపథ్యం తెలుసుకోవడం ప్రజలకు అవసరం. ప్రస్తుత విచారణ ప్రధాన లక్ష్యం ప్రజాస్వామికంగా ఎన్నికైన సంస్థల స్వచ్ఛతను కాపాడడమే.’

  - జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం

  Updated Date - 2020-09-18T07:25:07+05:30 IST