ఆరోగ్యసేతు యాప్: పది కోట్ల డౌన్‌లోడ్‌లకు చేరువలో...

ABN , First Publish Date - 2020-05-11T23:02:23+05:30 IST

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కీలకంగా మారిన ఆరోగ్యసేతు యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఏప్రిల్ రెండున విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 9.8 కోట్ల మంది ఆరోగ్య...

ఆరోగ్యసేతు యాప్: పది కోట్ల డౌన్‌లోడ్‌లకు చేరువలో...

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కీలకంగా మారిన ఆరోగ్యసేతు యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఏప్రిల్ రెండున ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ 9.8 కోట్ల మంది ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ మంగళవారం నుంచి జియో ఫీచర్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యసేతులోని డాటా సంరక్షణ కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని ఎంపవర్‌డ్ గ్రూప్ 9 చైర్మెన్ అజయ్ సాహ్నీ తెలిపారు. 


కరోనాకు సంబంధించి పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఆరోగ్యసేతు డాటా అందుబాటులో ఉంటుందని, ప్రైవసీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా స్పష్టం చేశారు. డాటా అంతా పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అయిన సర్వర్‌లో దాస్తున్నామని చెప్పారు. పేరు, మొబైల్ నెంబర్, వయసు, వృత్తి, గడచిన 30 రోజుల్లో విదేశీ పర్యటనలు చేసి ఉంటే ఆ వివరాలు యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుందన్నారు. అప్‌లోడ్ చేసిన డాటా 45 రోజుల్లో శాశ్వతంగా డిలీట్ అయిపోతుందని తెలిపారు. ఒకవేళ కరోనా సోకి ఉంటే కోలుకున్న తర్వాత ఆ వివరాలు కూడా 60 రోజుల్లో పూర్తిగా డిలీట్ అయిపోతాయని కాంత్ తెలిపారు. గడచిన ఆరు వారాల్లో కరోనాపై పోరులో ఆరోగ్యసేతు యాప్ సాంకేతిక పరిష్కారంలా మారి కీలక పాత్ర పోషిస్తోందని కాంత్ చెప్పారు. ఈ యాప్ వల్ల గుప్తంగా ఉన్న హాట్‌స్పాట్‌లను గుర్తించామని తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 మధ్య 130 హాట్‌స్పాట్‌లను గుర్తించామని చెప్పారు. 


కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తమయ్యేలా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ యాప్‌ను రూపొందించింది. ఐవోఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు పనిచేస్తుంది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే  ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

   

హెల్ప్‌లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు, ఇతర వివరాలు, వైద్య సలహాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే ఈ యాప్ అప్రమత్తం చేసి హెచ్చరిస్తుంది. అత్యంత సులభంగా వినియోగించేందుకు వీలుగా దీన్ని 11 భాషల్లో రూపొందించారు. ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల వినియోగదారులు కరోనాపై అప్రమత్తం కావడంతో పాటు.. అటు ప్రభుత్వానికి కూడా సాయం చేసిన వారవుతారు. 

Updated Date - 2020-05-11T23:02:23+05:30 IST