ఆప్‌.. మళ్లీ స్వీప్!

ABN , First Publish Date - 2020-02-12T07:21:42+05:30 IST

ఆప్‌.. మళ్లీ స్వీప్!

ఆప్‌.. మళ్లీ స్వీప్!

దేశ రాజధానిలో జాతీయ పార్టీలను చీపురు మరోసారి ఊడ్చిపారేసింది! సీఏఏ, ఎన్నార్సీ వంటి జాతీయవాద అంశాలపై సంక్షేమం పైచేయి సాధించింది! వరుసగా రెండోసారి కూడా బీజేపీని సింగిల్‌ డిజిట్‌కు; కాంగ్రె్‌సను ‘జీరో’కు పరిమితం చేస్తూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ స్వీప్‌ చేసింది! ఐదేళ్ల కిందటి ఫలితం అచ్చుగుద్దినట్లు పునరావృతమైంది! సామాన్యుడు వరుసగా మూడోసారి అసాధారణ హ్యాట్రిక్‌ సాధించాడు! 


 • బీజేపీ, కాంగ్రెస్‌లను ఊడ్చేసిన చీపురు
 • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌
 • 62 స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘనవిజయం
 • ఐదేళ్ల కిందటి ఫలితం పునరావృతం
 • సింగిల్‌ డిజిట్‌ (8)కే పరిమితమైన బీజేపీ
 • వరుసగా రెండోసారీ ఖాతా తెరవని కాంగ్రెస్‌
 • సీట్లను నిలబెట్టుకున్న 44 మంది ఎమ్మెల్యేలు
 • ఎస్సీ స్థానాలు ఆప్‌కే.. ముస్లిం ప్రాంతాలు కూడా

 • ఢిల్లీ వాసులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు
 • ఐ లవ్‌ యూ: కేజ్రీ ఆనందోత్సాహాలు
 • 14న సీఎంగా ప్రమాణ స్వీకారం
 • సంక్షేమ పథకాలతో పెరిగిన క్రేజ్‌
 • నిరుపేదలను మెప్పించిన విద్య, వైద్యం
 • భద్రత కల్పించడంతో మహిళల ఓటు
 • ఓట్లు రాల్చిన ‘హనుమాన్‌ చాలీసా’
 • జాతీయ ఉచ్చులో పడని కేజ్రీవాల్‌
 • బెడిసిన బీజేపీ ‘జాతీయ’ వ్యూహం!
 • సీఏఏ, ఎన్నార్సీ ప్రచారాస్త్రాలు విఫలం
 • ఫలించని 22 ఏళ్ల కమలం నిరీక్షణ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా వంటి చాణక్యుల వ్యూహాలను దీటుగా ఎదుర్కొని అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి విజేతగా నిలిచారు. ముచ్చటగా మూడోసారి ఈ నెల 14న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 8వ తేదీన జరగ్గా.. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా.. ఏకంగా 62 సీట్లలో ఆప్‌ విజయ దుందుభి మోగించింది. రెండు దశాబ్దాల తర్వాత ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ.. మరోసారి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. కేవలం 8 సీట్లనే గెలుచుకుంది.


ఇక, షీలా దీక్షిత్‌ హయాంలో ఢిల్లీలో హ్యాట్రిక్‌ కొట్టిన కాంగ్రెస్‌ పార్టీ వరుసగా రెండోసారి ‘డకౌట్‌’ అయింది! కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పూర్తిగా చతికిలపడింది. ఐదేళ్ల కిందట 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 67 సీట్లను గెలుచుకోగా.. ఈసారి ఐదు తగ్గాయి. ఇక, గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా.. ఇప్పుడు ఆ సంఖ్య మరో ఐదుకు పెంచుకుంది. ఎన్నికల్లో బీజేపీ 53.57 శాతం ఓట్లను ఆప్‌ సాధిస్తే.. బీజేపీ కేవలం 38.51 శాతానికే పరిమితమైంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని ఆప్‌ ఈసారి కూడా నిలబెట్టుకోవడం విశేషం. ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే అతి తక్కువగా కాంగ్రెస్‌ కేవలం 4 శాతం ఓట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో ఏకంగా 44 మంది ఎమ్మెల్యేలు తమ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. వరుస విజయాలు సాధించారు. వీరిలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. అంతేనా, ఢిల్లీలో 12 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా.. అన్నిట్లోనూ ఆప్‌ జయకేతనం ఎగరేసింది. తొలిసారిగా 16 మంది ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా.. వీరంతా ఆప్‌ అభ్యర్థులే కావడం మరో విశేషం.


హోరాహోరీ పోరు సాగినా.. మనీశ్‌ సిసోడియా సహా పలువురు ఆప్‌ ప్రముఖులు విజయ తీరాలను చేరారు. విచిత్రం ఏమిటంటే.. ఢిల్లీలో ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. ఎనిమిది నెలల కిందట జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్నిట్లోనూ బీజేపీ జయకేతనం ఎగరేసింది. కానీ, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కమలం పూర్తిగా వాడిపోయింది. చీపురు చిందేసింది! ఎన్నికల ఫలితాలతో ఉబ్బితబ్బిబ్బైన కేజ్రీవాల్‌.. ‘‘ఢిల్లీవాసులూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఐ లవ్‌ యూ’’ అని వ్యాఖ్యానించారు. ఇది భరతమాత విజయమన్నారు. 14న ప్రేమికుల దినోత్సవం రోజు సీఎంగా ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా.. ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కేజ్రీవాల్‌ కూడా స్పందించారు. ఢిల్లీని ప్రపంచస్థాయి రాజధానిగా చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.


ఇక, ఆప్‌ అద్వితీయ విజయాన్ని ప్రతిపక్ష నేతలు కొనియాడారు. బీజేపీ విద్వేష రాజకీయానికి చెక్‌ పడిందని, మార్పు మొదలైందని అభివర్ణించారు. రాహుల్‌ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, విజయన్‌, కేసీఆర్‌, జగన్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, మంత్రి కేటీఆర్‌ తదితరులు కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.


కేజ్రీ... లవ్‌ స్టోరీ!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉంటుందన్న మాటను రుజువు చేస్తూ కేజ్రీకి అండగా నిలిచారు ఆయన భార్య సునీత. వీరిది ప్రేమ వివాహం.  ఇద్దరూ సివిల్స్‌ పరీక్ష రాసి ఐఆర్‌ఎ్‌సకు ఎంపికై నాగ్‌పూర్‌లోని ఐఆర్‌ఎస్‌ అకాడమీలో శిక్షణ కోసం వచ్చారు. కేజ్రీ నిజాయితీ, దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఆమెను ఆకట్టుకొన్నాయి. ఆమె తెలివితేటలు, వ్యక్తిత్వం చూసి కేజ్రీ కూడా ఆమెను ప్రేమించారు. కేజ్రీ కుటుంబం హరియాణాలోని హిస్సార్‌లో ఉండేది. సునీత కుటుంబం అప్పటికే ఢిల్లీలో స్థిరపడింది. కేజ్రీ, సునీత పెళ్లికి తొలుత వారి పెద్దలు ఒప్పుకోలేదు. తర్వాత సమ్మతి తెలిపారు. 1994 నవంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వీరికి కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్‌ ఉన్నారు. 


ఇంతకంటే బర్త్‌డే గిఫ్ట్‌ ఏముంటుంది?

 • కేజ్రీవాల్‌ భార్య సునీత సంతోషం

తన పుట్టిన రోజున ఢిల్లీ ప్రజలు అందించిన విజయం కంటే పెద్ద బహుమతి ఏం ఉంటుందని కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఆమె ఎన్నికల్లో చురుగ్గా పనిచేశారు.  ఎన్నికల ప్రచారంలో ఎత్తుపల్లాలను చూశామని, తన భర్తపై ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  


‘‘ఈరోజు మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. ఢిల్లీ ప్రజలను హనుమాన్‌జీ ఆశీర్వదించారు. వచ్చే ఐదేళ్లూ ప్రజలకు సేవ చేయడానికి మనకు సరైన దారి చూపాలని ప్రార్థిస్తున్నాను’’ 

- ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌


ప్రజలే కేంద్రంగా ఆలోచించి పాలన చేస్తే తప్పకుండా ప్రజాభిమానం పొందుతారనడానికి కేజ్రీవాల్‌ విజయమే ఒక ఉదాహరణ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుంది.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

Updated Date - 2020-02-12T07:21:42+05:30 IST