ఆ సీఎం ఆడిపోసుకోవడంతోనే ఢిల్లీ సరిహద్దులు మూసేశాం : రాఘవ్ చద్దా
ABN , First Publish Date - 2020-06-01T21:30:09+05:30 IST
వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే
న్యూఢిల్లీ : వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎందుకు ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నారన్న దానిపై ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా వెల్లడించారు. ‘‘ఢిల్లీ ప్రజల కారణంగానే యూపీలో కరోనా విజృంభించింది... అని సాక్షాత్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వారి అధికారులు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. హర్యానా కూడా అచ్చు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. సరిహద్దుల్లోని రోడ్లను కూడా తవ్వేశారు.’’ అని పేర్కొన్నారు.
అయితే... వారు అలా ఆరోపించినందుకు తాము ఈ నిర్ణయం ఎంతమాత్రమూ తీసుకోలేదని, ప్రతీకారం తీర్చుకోవడం తమ విధానం ఎంతమాత్రమూ కాదని తేల్చి చెప్పారు. యూపీ ముఖ్యమంత్రికి, హర్యానా ముఖ్యమంత్రికి ఏవిధంగానైతే వారి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ ఉందో... తమకూ అంతే శ్రద్ధ ఉందని, ఈ కోణంలోనే సరిహద్దులు మూసేయడం అన్న నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
అయితే ఈ నేపథ్యంలో ప్రజల నుంచి సూచనలు తీసుకుంటూనే ఉన్నామని, వాటి ప్రకారమే తమ ప్రభుత్వం నడుచుకోడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. లాక్‌డౌన్‌ను విధిస్తున్న సమయంలో రాష్ట్రాలు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పీఎం మోదీ సూచించారని, ఇప్పుడు తాము అక్షరాలా అదే నిర్ణయాన్ని ఆచరిస్తున్నామన్నారు. గత 65 రోజులుగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు.
ఢిల్లీ అందరికీ చెందిన ప్రాంతమని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారన్నారు. వారు కూడా ఇక్కడే చికిత్స పొందుతున్నారని, ఈ సంక్లిష్ట సమయంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో చికిత్స పొందాలనుకునే వారి విషయంలో నిర్ణయం తీసుకోడానికి తాము ఓ వారం సమయం కోరామని, ఈ విషయంలో ప్రజల నుంచి సలహాలను అడిగామని రాఘవ్ చద్దా తెలిపారు.