రూ.2,500 కోట్ల స్కామ్‌‌లో బీజేపీ నేతలు: ఆప్

ABN , First Publish Date - 2020-12-13T23:57:27+05:30 IST

బీజేపీ సారథ్యంలోని నార్త్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)లో చోటుచేసుకున్న..

రూ.2,500 కోట్ల స్కామ్‌‌లో బీజేపీ నేతలు: ఆప్

న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని నార్త్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)లో చోటుచేసుకున్న రూ.2,500 కోట్ల అవినీతి కుంభకోణంలో ప్రమేయం ఉన్న బీజేపీ నేతలకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొమ్ముకాస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఆదివారంనాడు ఆరోపించారు.


'బీజేపీ నేతలు రూ.2.500 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. అది డాక్టర్లు, నర్సులు, టీచర్ల సొమ్ము. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని మేము కోరుతున్నాం' అని మీడియాతో మాట్లాడుతూ అతిషి అన్నారు. ఎల్జీ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారని, నలుగు వ్యక్తులు మాత్రమే ఆయనను కలుసుకునేందుకు వెళ్లినప్పటికీ ఆయన తమను కలవలేదని చెప్పారు. పైగా తమను నిర్బంధించారని అన్నారు. ఏ బీజేపీ నేతలకు అమిత్‌షా, ఎల్జీ బైజల్ కొమ్ము కాస్తున్నారో తాము తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణమని, బీజేపీ నేతలను వాళ్లు కాపాడుతున్నారని విమర్శించారు. ఎంసీడీలో జరిగిన రూ.2.500 కోట్ల స్కామ్‌తో ప్రమేయమున్న వారిని కాపాడేందుకే ఆప్‌ ఎమ్మెల్యేలపై అమిత్ షా, బైజల్ చర్చలు తీసుకుంటున్నారనే విషయం ఇవాళ చాలా స్పష్టంగా తేలిందన్నారు.


'కామన్ వెల్త్' కుంభకోణం కంటే పెద్దది...

కామన్ వెల్త్ స్కామ్‌ను ఢిల్లీలో జరిగిన పెద్ద కుంభకోణంగా చెబుతుంటారని, నార్త్ ఎంసీడీలో చోటేచేసుకున్న కుంభకోణం కామన్ వెల్త్ స్కామ్ కంటే చాలా పెద్దదని అతిషి అన్నారు. బీజేపీ కౌన్సిలర్లు, లీడర్లు కలిసి ఎంసీడీ వర్కర్లు, టీచర్లు, నర్సులు, డాక్టర్లకు చెందిన రూ.2.500 కోట్ల సొమ్మును దారి మళ్లించారని ఆమె ఆరోపించారు.


బీజేపీ నేతలపై ఒకరీతిలో, ఆప్ నేతలపై మరొక రీతిలో పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఆరోపించారు. కోవిడ్-19 దృష్ట్యా ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి తాను వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు తనను అరెస్టు చేశారని, అయితే ఇటీవల కేజ్రీవాల్ ఇంటిముందు బైఠాయించిన ఎమ్మెల్యేలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తప్పుపట్టారు.

Updated Date - 2020-12-13T23:57:27+05:30 IST