14ఏళ్ల వయసులో నాపై లైంగిక దాడి
ABN , First Publish Date - 2020-11-03T07:23:00+05:30 IST
తన 14ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురయ్యాయని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్(23) తాజాగా వెల్లడించారు...
- అమీర్ ఖాన్ కుమార్తె ఐరా వెల్లడి
ముంబై, నవంబరు 2: తన 14ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురయ్యాయని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్(23) తాజాగా వెల్లడించారు. తనపై ఆ దాడికి పాల్పడింది బాగా తెలిసిన వ్యక్తేనని పేర్కొన్నారు. ‘‘నాకు 14ఏళ్లు ఉన్నప్పుడు నాపై లైంగిక దాడి జరిగింది. ఆ వయసులో నాకు అది అర్థం కాలేదు. ఏడాది అనంతరం అసలు విషయం అర్థమై మా తల్లిదండ్రులకు వెంటనే ఈమెయిల్ పెట్టాను. వారి సహాయంతో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను. ఆ ఘటన గురించి ఇప్పుడు ఆలోచన లేదు కానీ.. నాకు తెలియకుండా అయినా సరే, అలా జరగనిచ్చినందుకు గతంలో అప్పుడప్పుడూ నన్ను నేను కొట్టుకునేదానిని. ప్రస్తుతం ఆ ఘటన తాలూకు జ్ఞాపకాల్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగుతున్నా’’ అని ఐరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పది నిముషాల నిడివి గల వీడియోలో తెలిపారు. తాను నైరాశ్యంతో పోరాడుతున్నానని నెల రోజుల క్రితం ఐరా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమీర్‌ఖాన్, ఆయన మొదటి భార్య రీనా దత్తాలకు 1997లో ఐరా జన్మించారు.