విదేశీ ప్రయాణ చరిత్ర లేని మహిళకు కరోనా వైరస్ పాజిటివ్

ABN , First Publish Date - 2020-03-21T19:52:35+05:30 IST

విదేశీ ప్రయాణాలు చేయని, కోవిడ్-19 రోగితో సంబంధాలు లేని ఓ మహిళకు కరోనా వైరస్ (కోవిడ్-19) పాజిటివ్ అని శనివారం నిర్థరణ అయింది.

విదేశీ ప్రయాణ చరిత్ర లేని మహిళకు కరోనా వైరస్ పాజిటివ్

పుణే : విదేశీ ప్రయాణాలు చేయని, కోవిడ్-19 రోగితో సంబంధాలు లేని ఓ మహిళకు కరోనా వైరస్ (కోవిడ్-19) పాజిటివ్ అని శనివారం నిర్థరణ అయింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ఈ వివరాలను వెల్లడించింది. దీంతో ఇది బహుశా భారత దేశంలో మొదటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసు అయి ఉండవచ్చుననే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ మన దేశంలో నలుగురిని బలి తీసుకోగా, 258 మందికి సోకింది. 


మహారాష్ట్ర ఆరోగ్య శాఖాధికారి ఒకరు మాట్లాడుతూ పుణేకు చెందిన 41 ఏళ్ళ వయసుగల ఓ మహిళకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందన్నారు. ఇది లోకల్ ట్రాన్స్‌మిషన్ అయి ఉంటుందన్నారు. 


జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ రామ్ మాట్లాడుతూ ఈ మహిళ భారతి ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆమె విదేశీ ప్రయాణాలు చేయలేదని, అయితే ఆమె ఈ నెల 3న నవీ ముంబైలోని వసిలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆమె విదేశాలకు వెళ్ళి వచ్చినవారిని కలిసి ఉండవచ్చునన్నారు. ఈ కేసును ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. 


భారతి ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ సంజయ్ లాల్వానీ మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ మహిళను ఈ నెల 16న తమ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. శుక్రవారం ఆమెకు వెంటిలేటర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఐసీఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితురాలికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 


ఇదిలావుండగా, 20 ఏళ్ళ వయసుగల ఓ ఢిల్లీవాసికి తమిళనాడులో జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యువకునికి కూడా విదేశీ ప్రయాణ చరిత్ర లేదని తెలుస్తోంది. 


మన దేశంలో సామాజిక వ్యాప్తి దశకు కరోనా వైరస్ చేరుకోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపిన వివరాల ప్రకారం మన దేశం ఇంకా కరోనా వైరస్ స్టేజ్-2లోనే ఉంది, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరుకోలేదు.


రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ అర్చన పాటిల్ మాట్లాడుతూ కోవిద్-19 రోగి పరిస్థితి విషమంగా ఉంటే, హెచ్ఐవీ మందులను వాడవచ్చునని ఐసీఎంఆర్ సిఫారసులు చెప్తున్నాయన్నారు. 


Updated Date - 2020-03-21T19:52:35+05:30 IST