డాక్టర్ అంత్యక్రియలపై మూక దాడి
ABN , First Publish Date - 2020-04-21T09:48:27+05:30 IST
కొవిడ్ బాధితులకు చికిత్స చేస్తూ మరణించిన, చెన్నైకు చెందిన ఓ డాక్టర్ అంత్యక్రియలకు స్థానికులు తీవ్ర

కరోనా వ్యాపిస్తుందంటూ ఖననాన్ని అడ్డుకున్న జనం
రహస్యంగా ఖననం చేసిన తోటి డాక్టర్
ఇదేనా మాకిచ్చే గౌరవం?: ఐఎంఏ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కొవిడ్ బాధితులకు చికిత్స చేస్తూ మరణించిన, చెన్నైకు చెందిన ఓ డాక్టర్ అంత్యక్రియలకు స్థానికులు తీవ్ర అడ్డంకులు కల్పించడమే కాక... వచ్చిన మెడికల్ సిబ్బందిపై దాడి చేయడం కలకలం రేపింది. డాక్టర్ సైమన్ హెర్క్యులస్ (55) అనే న్యూరోసర్జన్ గత 20రోజులుగా కొవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇంటికి కూడా వెళ్లకుండా సేవలు అందించారు. అలాంటి ఆయనకు వైరస్ సోకింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయనకు శ్వాసకోశ సమస్య ఏర్పడి అది గుండెపోటుకు దారితీసింది. చివరకు ఇదే వైర్‌సతో పోరాడుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కిల్పాక్‌లో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననం చేయాలని భావించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాక- దాన్ని అన్నానగర్ ప్రాంతంలో ఉన్న కిల్పాక్ సిమెట్రీ వైపు ఓ అంబులెన్స్‌లో తీసికెళుతున్నపుడు స్థానికులు అడ్డుకున్నారు. ఆ మృతదేహాన్ని ఖననం చేస్తే ఆ ప్రాంతమంతా వైరస్ చుట్టుముడుతుందని నానా రభస చేశారు.
ఆ అంబులెన్స్‌పై రాళ్లు విసిరారు. దీంతో కుటుంబ సభ్యులు ఆ వ్యాన్‌ను వదిలి బయటకు పారిపోవాల్సి వచ్చింది. ఆ డాక్టర్‌తో పాటు వచ్చిన డాక్టర్ శోభరాజ్ అనే తోటి డాక్టరొకరు.. బలవంతంగా అంబులెన్స్‌ను వేరే చోటికి తీసుకుపోయారు. దీంతో-- అక్కడ ఖననం జరగదని భావించి స్థానికులు వెనుదిరిగారు. ఆదివారం ఉదయం మరణించిన ఆ డాక్టర్ మృతదేహాన్ని అర్థరాత్రి వరకూ డాక్టర్ భాగ్యరాజ్ రహస్యంగా ఉంచారు. అప్పుడు దాన్ని తానే మరో ఇద్దరు వార్డు బాయ్‌ల సహకారంతో తీసికెళ్లి వేరే శ్మశాన వాటికలో గొయ్యి తీసి ఖననం చేశారు.
అతి రహస్యంగా ఈ తంతు నడిపించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని తన సెల్‌ఫోన్‌లోనే వీడియో తీసి డాక్టర్ భాగ్యరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొవిడ్ రోగులకు చికిత్స చేసే డాక్టర్ల పరిస్థితి ఇదీ... అని వివరించారు. ఈ వీడియో దేశమంతా వైరల్ అయింది. ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా మండిపడింది. ‘‘మరణంలో గౌరవం ఇవ్వాలి.. అందునా ఇలాంటి వారికి! అంత్యక్రియలకు వీల్లేదంటారా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?’’ అని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు రంజన్ శర్మ ఓ ప్రకటనలో దుమ్మెత్తి పోశారు. ‘మమ్మల్ని కరోనా వారియర్స్ అంటూ ప్రధాని మోదీ గౌరవించారు. ప్రజలకు ఇలాంటివి పట్టవా? రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తాయా’ అని నిలదీశారు.