నాలుగు దంత వైద్య కళాశాలలకు రూ.8.20 కోట్ల జరిమానా

ABN , First Publish Date - 2020-09-16T07:37:52+05:30 IST

మ్యాప్‌ ఆఫ్‌ రౌండ్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వ కోటాలోని 82 సీట్లకు అనధికారికంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించిన కారణంగా నాలుగు డెంటల్‌ కళాశాలలకు భారీగా జరిమానా విధించారు.

నాలుగు దంత వైద్య కళాశాలలకు  రూ.8.20 కోట్ల జరిమానా

బెంగళూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మ్యాప్‌ ఆఫ్‌ రౌండ్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వ కోటాలోని 82 సీట్లకు అనధికారికంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించిన కారణంగా నాలుగు డెంటల్‌ కళాశాలలకు భారీగా జరిమానా విధించారు.

ఉత్తర కర్ణాటకలోని నాలుగు దంత వైద్య కళాశాలలకు కర్ణాటక హైకోర్టు గుల్బర్గా బెంచ్‌ ఏకంగా రూ.8.20 కోట్ల మేరకు జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ ఎన్‌.దీక్షిత్‌, జస్టిస్‌ పీ కృష్ణభట్‌లతో కూడిన ఽధర్మాసనం ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున జరిమానాను రెండు నెలల్లోగా చెల్లించాలని సోమవారం ఆదేశించింది.

కాగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 82 మంది అడ్మిషన్లను క్రమబద్ధీకరించాలని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సూచించింది. ఇదే సమయంలో అక్రమంగా సీట్లు పొందిన దంత విద్యార్థులు 82 మందీ త మ కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల పాటు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది.

బీదర్‌కు చెందిన ఎస్‌బీ పాటిల్‌ దంత కళాశాల, ఎస్‌బీ పాటిల్‌ డెంటల్‌సైన్స్‌ పరిశోధనా కళాశాల, గుల్బర్గా జిల్లాలోని హుమ్నాబాద్‌లో గల హైదరాబాద్‌-కర్ణాటక అభివృద్ధి విద్యాట్రస్టు దంత కళాశాల, ఎస్‌ నిజలింగప్ప దంతవైద్య కళాశాల హైకోర్టును ఆశ్రయించాయి.


Updated Date - 2020-09-16T07:37:52+05:30 IST