ఇంటిని కాపాడుకోవడానికి ప్రాణాలొదిలిన దంపతులు

ABN , First Publish Date - 2020-12-30T17:57:20+05:30 IST

బతకడానికి రక్షణనిచ్చిన గూడును కాపాడుకోవడానికి ప్రయత్నించిన

ఇంటిని కాపాడుకోవడానికి ప్రాణాలొదిలిన దంపతులు

తిరువనంతపురం : బతకడానికి రక్షణనిచ్చిన గూడును కాపాడుకోవడానికి ప్రయత్నించిన కేరళ దంపతులు కడతేరిపోయారు. తాము నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయించేందుకు కోర్టు ఆదేశాలతో వచ్చిన పోలీసులను అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి అసువులుబాశారు. దీంతో వారి పిల్లలిద్దరూ అనాథలయ్యారు. అయితే పిల్లలను ఆదుకుంటామని కేరళ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 


తిరువనంతపురంలోని నెయ్యట్టింకర పోలీస్ స్టేషన్ అధికారులు, నెయ్యట్టింకర కోర్టు నియమించిన జ్యుడిషియల్ కమిషన్ కలిసి నెల్లిమూడులోని రాజన్ ఇంటికి వెళ్ళారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, తక్షణమే ఆ గుడిసెను ఖాళీ చేయాలని రాజన్ కుటుంబ సభ్యులను ఆదేశించారు. దీంతో రాజన్ ఆవేదనతో తనపై పెట్రోలు పోసుకుని, తన భార్య అంబిలిపైనా పెట్రోలు పోశారు. పోలీసులు తమ దగ్గరకు వస్తే, తాము నిప్పు అంటించుకుని, మరణిస్తామని హెచ్చరించారు. ఆయన చేతిలోని లైటర్‌ను లాక్కునేందుకు ఓ పోలీసు అధికారి ప్రయత్నించడంతో, ప్రమాదవశాత్తూ ఆ దంపతులకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. వారిని కాపాడబోయిన పోలీసు అధికారికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 


రాజన్ కుమారుడు రంజిత్ మాట్లాడుతూ, తమ తండ్రి నియమించుకున్న న్యాయవాది ద్రోహం చేసినట్లు ఆరోపించారు. మున్సిఫ్ కోర్టు ఆర్డర్‌పై స్టే వస్తుందని పోలీసులకు, ప్లెయింటిఫ్‌కు తెలుసునన్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ ఈ దారుణం జరగడానికి బాధ్యత వహించాలన్నారు. 


రాజన్ చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన భార్య అంబిలి సోమవారం సాయంత్రం ప్రాణాలు విడిచారు. అంబిలి చికిత్స పొందుతున్న సమయంలోనే, రాజన్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం పోలీసులు తీసుకెళ్ళారు. తన తండ్రిని ఖననం చేసేందుకు తనను పోలీసులు అనుమతించడం లేదని రాజన్ కుమారుడు రంజిత్  అన్నారు. ‘‘మీరే మా తండ్రిని చంపారు, మా అమ్మ మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆయన మృతదేహాన్ని ఖననం చేయడానికి అనుమతించడం లేదు’’ అని రంజిత్ పోలీసులతో అంటున్నట్లు వీడియోలో కనిపించింది.  రంజిత్ పోలీసులతో మాట్లాడుతున్న సమయానికి ఆయన తల్లి అంబిలి చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయారు. 


రాజన్, అంబిలి దంపతుల పిల్లల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సానుకూలంగా స్పందించారు. వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన స్థలంలోనే రాజన్ అంత్యక్రియలు చేసేందుకు అనుమతించారు. అంబిలి మృతదేహం తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఉందని, కోవిడ్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-12-30T17:57:20+05:30 IST